Brahmamudi serial today Episode: గూగుల్ మ్యాప్‌లో కావ్య అడ్రస్ కనుక్కున్నానని సంతోషంగా అర్థరాత్రి కావ్యకు ఫోన్ చేస్తాడు రాజ్. ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారని కావ్య అడగ్గానే.. మీరు పొడిచిన పొడుపుకథ విప్పాను.. అంటూ ఏదేదో అడ్రస్ చెప్తాడు రాజ్ కావ్య నవ్వుతుంది. మీరు భలే తెలివైన వారండి సూపర్ గా కనిపెట్టారు అంటూ పొగుడుతుంది. దీంతో రాజ్ రేపు మీకు ఇంకో ట్విస్ట్ ఇస్తాను. నేరుగా మీ ఇంటికే వస్తాను చూడండి అంటాడు దీంతో కావ్య నవ్వుకుంటూ ఆయన వెళ్లే ఇంట్లో కుక్క లేకుండా ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటుంది. ఈసారి అస్సలు కన్పీజ్ అవ్వను ఎగ్జాక్ట్ లోకేషన్‌లో దిగి మీకు కాల్ చేస్తాను. సంబ్రమాశ్చర్యాల్లో ముగిని తేలడానికి మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు. దీంతో కావ్య అలాగే కళ్లలో కాటన్ వత్తులు వేసుకుని ఎదురుచూస్తాను అంటుంది. అయితే నన్ను చూసిన ఆ కళ్లల్లో వెలుగు నేను చూస్తాను అంటూ గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేస్తాడు.
వైదేహి వాళ్లు లాప్‌ట్యాప్‌లో ఏవో చూస్తుంటే యామిని వచ్చి ఏంటి మమ్మీ వెడ్డింగ్ సెలెక్షన్ చేస్తున్నారా..?అని అడుగుతుంది. దీంతో వైదేహి అది చేయాల్సింది మేము కాదు. నువ్వు అల్లుడుగారు అని చెప్తుంది. దీంతో యామిని నాకు రామ్‌ను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ ఇవన్నీ నేను పట్టించుకోను. ఇదంతా మీకోసం మీ ఆనందం కోసం అని చెప్పగానే.. యామిని వాళ్ల డాడీ ఇదంతా నీ ఆలోచన బేబీ రాజ్ మనసులో ఏమనుకుంటున్నాడో అది కూడా తెలుసుకోవాలి కదా అంటాడు. దీంతో యామిని కోపంగా డాడీ నీకు ఎన్ని సార్లు చెప్పాలి రాజ్ కాదు రామ్ అని అంటూ కోప్పడుతుంది. దీంతో వాళ్ల డాడీ పేరు మారితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు బేబీ మనసు మారితేనే అసలు ప్రాబ్లమ్ అంటాడు. ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడుతున్నారు అని యామిని అడుగుతుంది.
దీంతో రామ్ గుడికి అని చెప్పి వెళ్లి వాళ్ల అమ్మను కలిశాడు. ఆ కావ్య పదే పదే రామ్‌ను కలుస్తుంది. ఇదంతా చూస్తుంటే.. నాకు ఈ పెళ్లి జరుగుతుందా అని అనుమానం కలుగుతుంది అంటాడు. దీంతో యామిని నీకు ఆ అనుమానమే అక్కరలేదు డాడీ మా పెళ్లిని ఎవరూ ఆపలేరు అంటుంది. దీంతో వైదేహి.. ఆ కావ్యను తక్కువ అంచనా వేయకు బేబీ అంటుంది. దీంతో యామిని అదే నన్ను తక్కువ అంచనా వేస్తుంది మమ్మీ.. నేను నేరుగా తనతో యుద్దం చేయాలని నన్ను రెచ్చగొట్టాలని చూస్తుంది. ఆవేశంలో నేను నిజం బయటపెట్టాలని చూస్తుంది అని చెప్పాగానే కావ్య ఉద్దేశం నీ నుంచి నిజం చెప్పించడమే అయితే ఎప్పుడో చేసేది. తనకు కావాల్సింది అది కాదు. తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గతాన్ని గుర్తు చేయడమే తనకు ముఖ్యం అని యామిని డాడ్ చెప్తాడు. దీంతో అది జరగని పని డాక్టర్ గారు చెప్పారు కదా డాడ్ అతనికి ఎప్పటికీ గతం గుర్తుకు రాదని అని యామిని అనగానే.. వైదేహి మనం మన జాగ్రత్తలో ఉండాలి అని చెప్తుంది. అల్లుడు గారు కూడా ఈ పెళ్లి పనుల్లో ఇన్‌వాల్వ్ అయితేనే బాగుంటుంది. అలాగే ఆ కావ్య మీద కూడా ఒక కన్నేసి ఉంచు అని చెప్పగానే.. దాని సంగతి నేను చూసుకుంటాను ముందు మీరు కార్డ్స్ ప్రింట్ వేయించండి అని చెప్తుంది యామిని.
దుగ్గిరాల ఇంట్లో అందరూ క్యారమ్స్ అడుతుంటారు. మరోవైపు రాజ్ కారు వేసుకుని కావ్య కోసం వస్తుంటాడు. ఈ దారిలో నేను ఎప్పుడో వచ్చినట్టు ఉందేంటి అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. క్యారమ్స్ ఆడుతున్న అందరికీ కావ్య జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అపర్ణ పక్కన కూర్చుని తను కూడా క్యారమ్స్ ఆడుతుంది. ఇంతలో రాజ్ కారులో వచ్చి దుగ్గిరాల ఇంటి బయట ఆగుతాడు. ఏదో రోజు వచ్చి ఆగే ప్లేస్‌లో ఆగినట్టు నేరుగా వచ్చి ఆగిపోయాను ఏంటి..? ఏంటీ ప్లేసు.. అనుకుంటూ కారు దిగి అటూ ఇటూ చూస్తాడు. దుగ్గిరాల ఇల్లు కనిపిస్తుంది. ఈ ఇంటిని నేను ఇంతకుముందు ఎప్పుడైనా చూశాను. ఎక్కడ చూశాను. ఎప్పుడు చూశాను. ఈ ఇంటికి నాకు సంబంధం ఏంటి..? ఏ సంబంధం లేకపోతే ఎక్కడో చూసిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది. ఏంటో ఈ సమాధానం లేని ప్రశ్నలు వైఫైలా నా చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతకీ కళావతి గారు చెప్పిన అడ్రస్ ఇదేనా అనుకుంటూ లోపలికి వెళ్తుంటాడు.
రాజ్ లోపలికి రావడం కావ్య గమనిస్తుంది. షాక్ అవుతుంది. ఆయనలా ఉన్నారేంటి..? ఆయనలా ఏంటి ఆయనే.. ఓరి నాయనో నిన్న ఫోన్ లో అయన అడ్రస్ తప్పుగా చెబితే ఎక్కడికో వెళ్లి ఇరుక్కుంటారు అనుకుంటే ఇక్కడికే వచ్చి నన్ను ఇరికించారేంటి..? అని మనసులో భయపడుతూ.. అప్పుకు సైగ చేస్తుంది. బయటకు చూడమని చెప్తుంది. అప్పు బయటకు చూసి ఎలా అని సైగ చేస్తుంది. ఇద్దరినీ గమనించిన రుద్రాణి ఏంటి అక్కా చెల్లెలు ఏంటి..? సైగలతో సరసాలు ఆడుకుంటున్నారు. కావ్య ఈ సారి అప్పును పిచ్చిదాన్ని చేయబోతుందేమో మనకెందుకులే ఈకావ్యకు ఎంతదూరం ఉంటే అంత మంచిది అంటుంది. కావ్య వెంటనే అపర్ణకు రాజ్‌ను చూపిస్తుంది. అపర్ణ, రాజ్‌ను చూసి షాక్ అవుతుంది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు.. ఇప్పుడు ఎలాగే అంటుంది. మీరే ఏదో ఒకటి చేయాలి అత్తయ్యా త్వరగా ఏదో ఒకటి చేయండి అని కావ్య చెప్పగానే.. సరే నేను చూసుకుంటాను ఉండూ అంటూ నాకెందుకో ఈ గేమ్ ఇక్కడ బాగా అనిపించడం లేదు రూమ్‌లోకి వెళ్లి వేరే గేమ్ ఆడుదామని అందరినీ రూంలోకి తీసుకెళ్తుంది.
ఇంతలో రాజ్ లోపలికి వస్తుంటాడు. గోడకు ఉన్న రాజ్ ఫోటో చూసి కావ్య షాక్ అవుతుంది. అన్ని ఫోటోలు తీసేస్తుంది. రాజ్ లోపలికి రాగానే ఆశ్యర్యంగా రామ్ గారు మీరా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ అలా వచ్చేశాను అంటాడు రాజ్. దీంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?