Kissik Talks:తెలుగు సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే నటుడు మహేష్ అచంట. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకర్ వర్షతో కలిసి సందడి చేసిన మహేష్.. తన సినిమా ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, బ్రేకప్స్, మోసం, మనశ్శాంతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఆరుగురిని ఇష్టపడ్డా.. మహేష్ అచంట కామెంట్స్!
ఈ ఇంటర్వ్యూలో మహేష్ అచంట ఇప్పటివరకు ఎంతమందిని ఇష్టపడ్డారని వర్ష అడగ్గా.. మహేష్ సరదాగా ఆరుగురు, ఏడుగురు ఉంటారని చెప్పారు. అయితే వాళ్లను ఇష్టపడటమే కానీ, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
తాను గతంలో ఇష్టపడిన అమ్మాయిల్లో కొంతమంది అప్పుడప్పుడు ఫోన్ చేసి సినిమా టికెట్లు అడిగేవారని కూడా వెల్లడించారు. ‘రంగస్థలం’, ‘శతమానంభవతి’ సినిమాలకు సంబంధించిన టికెట్లు అడిగిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. అయితే తాను ఒకప్పుడు వాళ్లను ఇష్టపడ్డాననే విషయం వారికి తెలియదని చెప్పారు.ఇక ఈ విషయాలు తన భార్యకు తెలుసా అని వర్ష అడగడంతో మహేష్ తనదైన కామెడీతో సమాధానం ఇచ్చారు. తన భార్యకు కొన్ని విషయాలు చెప్పానని, అయితే వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదని సరదాగా వివరించారు..
బెస్ట్ పర్సన్ జీవితంలోకి వస్తే.. మిగతావన్నీ నథింగ్!
ప్రేమ గురించి మాట్లాడుతూ మహేష్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. జీవితంలో మనకు సరైన వ్యక్తి ఎదురైనప్పుడు గతంలో జరిగిన విషయాలన్నీ పెద్దగా గుర్తుకు రావని అన్నారు. మన జీవితంలో బెస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మిగతా వాళ్లంతా నథింగ్ అనిపిస్తారని వివరించారు.
కరోనా సమయంలో పెళ్లి.. ఫస్ట్ వేవ్‌లో మ్యారేజ్!
మహేష్ అచంట పెళ్లి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. తనది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని వర్ష అడగ్గా.. అది లవ్ మ్యారేజ్ కాదని చెప్పారు.కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తాను ఇంట్లో ఉన్నప్పుడు, కుటుంబ సభ్యుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరిందని వివరించారు. తన చిన్నమ్మ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. అలా పెద్దగా ప్రేమకథ లేకుండానే పెళ్లి జరిగిపోయిందని సరదాగా వెల్లడించారు.‘ఫస్ట్ వేవ్‌లో పెళ్లి.. సెకండ్ వేవ్‌లో పిల్లలు’ అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో నవ్వులు పూయించేలా ఉన్నాయి.
భార్య ఎలా ఉండాలనే విషయంలో మహేష్ ఆలోచన ఇదే!
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయికి ఆమె ఎలా ఉండాలనే విషయంలో మహేష్ తన అభిప్రాయాన్ని చెప్పారు. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు తన కోసం ఎదురుచూసే వ్యక్తి, షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన రాక కోసం ఎదురుచూసే వ్యక్తి ఉంటే చాలన్నారు.
రమ్యకృష్ణ అంటే అభిమానం
అలాగే భార్య ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో తాను ప్రత్యేకంగా ఆంక్షలు పెట్టనని చెప్పారు. ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని, తన ఇష్టాలను ఆమెపై బలవంతంగా రుద్దడం తనకు ఇష్టం లేదని వివరించారు.తనకు నటి రమ్యకృష్ణ అంటే అభిమానమని, ముఖ్యంగా ఆమె ‘నీలాంబరి’ పాత్ర అంటే చాలా ఇష్టమని సరదాగా చెప్పారు.
ALSO READ :బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!
మొత్తానికి మహేష్ అచంట ‘కిస్సిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం, స్నేహం, మనశ్శాంతి వంటి అంశాలపై తనదైన శైలిలో మాట్లాడారు. సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించడంతో పాటు, జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు.