Kalyana Lakshmi: పేదింటి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలన్నా.. ఒక నిరుపేద తండ్రి ధైర్యంగా కన్యాదానం చేయాలన్నా.. సర్కారు ఇచ్చే ఆ లక్ష రూపాయలే ఏకైక ధైర్యం. కానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో.. నిరుపేదల ఆశలు అంబరాన్నంటిన చోటే ఆవిరైపోయాయి. చట్టపరమైన లోపాలు, సాంకేతిక కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.. కానీ, ఆ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. చట్టబద్ధత లేకుండా, కేవలం జీవోలతో వేల కోట్ల ప్రజాధనాన్ని ఎలా పంపిణీ చేస్తారని కోర్టు ప్రశ్నించడం సరైందే కావచ్చు. ఆ చట్టపరమైన లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. నాలుగు వారాల క్రితమే కోర్టు వివరణ కోరినా.. సమాధానం చెప్పాల్సిన సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని నిరుపేద తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కనీసం కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం ఆగిపోతే.. డబ్బులు మిగులుతాయని ప్రభుత్వం లెక్కలు వేసుకుందా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కాగితాల గొడవలు న్యాయస్థానాల్లో వాదనలు ఇవాళ కాకపోతే రేపు తేలవచ్చు.. కానీ పెళ్లి ముహూర్తాలూ ఆగవు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అసెంబ్లీలో చట్టం తెస్తుందో, లేదంటే కోర్టును మెప్పించి స్టే తీసివేస్తుందో తెలియదు గానీ… పేదింట్లో పెళ్లి బాజాలు ఆగకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికీ ప్రభుత్వానిదే?