Viral traffic incident: ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు కాస్త ముందుకు దూకాయి. అప్పుడే ఓ వ్యక్తి ప్లాస్టిక్ కర్ర పట్టుకుని వచ్చి వాహనదారులను తెగ కొట్టేస్తున్నాడు. కొంతమంది వాహనాలను సొంతంగా లాగుతూ లైన్ వెనుకకు తిప్పేస్తున్నారు. ఇది పోలీసుల పని కాదు, ప్రభుత్వ చర్య కూడా కాదు.. ఇది ఒక సామాన్య పౌరుని ప్రయత్నం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఈ రూల్ ఇండియాలో కూడా వస్తుందా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేయడం విశేషం.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే ఇదిగో ఇలా జరుగుతుందనే కామెంట్లను నెటిజన్లు షేర్ చేస్తున్న ఈ వీడియో పట్ల ప్రశంసలతో పాటు విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఢాకా వీధుల్లో స్వచ్ఛంద పోలీస్..
ఈ వీడియో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చిత్రీకరించబడింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అష్రఫుల్ ఇస్లాం. అతడు పోలీస్ కానే కాదు. ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు. కానీ రోడ్డుపై అనవసరంగా గందరగోళంగా కదులుతున్న వాహనాల్ని చూసి ఎంతో కోపం వచ్చిన అతను.. తాను ప్లాస్టిక్ కర్రతో వీధిలోకి దిగిపోయాడు. లైన్ దాటిన వాహనాలను కొట్టి లైన్ వెనక్కి జరిపేస్తున్నాడు. ఒకేసారి కర్రతో కొట్టడం కాదు, కొందరు వాహనదారులను కింద దిగమని చెప్పి, తానే బైక్‌ను వెనక్కి లాగాడు. దీన్ని కొందరు స్థానికులు వీడియో తీశారు.
ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశమే
అష్రఫుల్ ఇస్లాం స్వయంగా చెప్పినట్టు.. తన ఉద్దేశ్యం ఎవరికీ హాని చేయడం కాదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ఎలా రోడ్లపై వ్యవస్థ ఉంటుంది అనే విషయాన్ని అందరికీ గుర్తు చేయడమే తన లక్ష్యమట. ప్రతి రోజు ఇదే సిగ్నల్ దగ్గర వాహనదారులు ఎవరినీ లెక్కచేయకుండా లైన్ దాటి ముందుకెళ్తారు. నన్ను చూసినా తొంగిచూస్తారు కానీ, వ్యవస్థను మాత్రం పట్టించుకోరు. అలాగని చూస్తూ ఊరుకోలేను.. కాబట్టి నేనే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు అష్రఫుల్.
వీడియో వైరల్.. నెటిజన్లు ఏమన్నారంటే?
ఈ వీడియో వైరల్ అయ్యాక.. నెటిజన్లు రెండు భాగాలుగా విడిపోయారు. కొంతమంది అతని చర్యలను అభినందిస్తూ, ఇలాంటి చర్యలు అవసరమే, ఇలాంటి పౌరులు ఉన్నప్పుడే సమాజం ముందుకు పోతుంది అంటూ మెచ్చుకున్నారు.
ఇంకొందరు మాత్రం దాన్ని తప్పుపట్టారు.
Also Read: Airport: సముద్రం మధ్యలో విమానాశ్రయం.. మహారాష్ట్రలో అద్భుత నిర్మాణం
ఇది అధికార దుర్వినియోగం కాకపోయినా, ఓ సామాన్య పౌరుడు ఇతరులను కొట్టడం చట్టబద్ధం కాదు, ఇలా చేయడం వల్ల అసహనం పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కొందరైతే ఈరోజు ప్లాస్టిక్ కర్ర… రేపు అది ఇనుప కర్ర కావచ్చు అంటూ హెచ్చరికలతో కూడిన అభిప్రాయాలు షేర్ చేశారు.
ఈ వీడియో చూస్తే నవ్వొస్తుంది. అష్రఫుల్ బైక్‌ను వెనక్కి లాగుతుంటే, బైక్ యజమాని అవాక్కైపోయి, హ్యాండిల్ మీద నుంచి తన్నుకుంటూ దిగిపోతాడు. అంతలో ఒక వ్యక్తి.. ఓహ్ బాయ్.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఇలా హ్యాండిల్ విరగాల్సిందే అంటూ కామెంట్ చేసాడు. ఇంకొకరు పోలీసులకు శాలరీ ఇచ్చే బదులు వీళ్లకే చందాలు తీసుకురావాలేమో అన్నారు.
ట్రాఫిక్ సమస్యలపై సామాన్యుడి గట్టి చర్య
ఈ వీడియో మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మనకు గుర్తు చేయాలంటే… ఏదో గదిలో సమావేశాలు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవసరం లేదు. ఒక సామాన్య వ్యక్తి కేవలం పట్టుదలతో వ్యవస్థపై చిన్న గొంతుగా మారితే చాలనేది.
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ట్రాఫిక్ పోలీస్ ఎంత శ్రమించాలనుకున్నా.. మార్పు మన లోపలే మొదలవ్వాలి. అష్రఫుల్ చేసే పద్ధతి సరైందా, తప్పుడు విధానమా అనేది పక్కన పెడితే.. కానీ అతని లక్ష్యం మాత్రం ది బెస్ట్ అంటున్నారు వాహనదారులు.
ఈ వీడియో హాస్యాన్ని అందించినా.. ఆలోచించాల్సిన సందేశాన్ని కూడా ఇచ్చింది. ఈ రోజు అష్రఫుల్ బంగ్లాదేశ్‌లో.. రేపు మన వీధుల్లో మనమే అలా ఆగాల్సి రావొచ్చు. కాబట్టి మనం ట్రాఫిక్ నిబంధనల్ని పాటిద్దాం. తప్పు చేసినవారిని తిట్టడం కాదు.. ముందుగా మనమే తప్పు చేయకుండా ఉండటం మొదలు పెడదాం.