Warangal Clash: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రాణ స్నేహితులు కూడా బద్ద శత్రువులుగా మారుతున్నారు. పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. అక్రమ సంబంధాలకు కొదవేలేదు. తాజాగా ఇన్ స్టాలో చేసిన ఒక రీల్ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. రెండు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ .. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఆ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో యువకులు, మహిళలలు రెచ్చిపోయారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
వైరల్ అయిన ముద్దు వీడియో
కొత్తవాడలో ఒకే వీధిలో నివసించే ఓ బాలిక, బాలుడు గత కొంతకాలంగా ప్రేమను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఒక ప్రదేశంలో ముద్దుపెట్టుకున్న వీడియోను సెల్ఫీ రీల్ రూపంలో తీసుకున్నారు. ఆ వీడియోను వారిలో ఒకరు Instagramలో పోస్టు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే వీడియో బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారికి చేరింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర గొడవ మొదలైంది.
రాత్రికిరాత్రే హింసాత్మకంగా మారిన గొడవ
మైనర్ బాలిక, బాలుడి ఇన్‌స్టా రీల్స్ వ్యవహారం.. ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య గొడవలో సుమారు 50 మంది యువకులు, మహిళలు రెచ్చిపోయారు. మారణాయుధాలతో యువకులు దాడులకు దిగారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
పోలీసుల రావడంతో పరిస్థితి అదుపులోకి
ఈ సమాచారం అందిన వెంటనే.. కొత్తవాడ పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు. మారణాయుధాలతో రోడ్లపైకి వచ్చిన యువకులను, గొడవలో పాల్గొన్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బాలిక బంధువుల ఆరోపణలు
ఈ సంఘటనపై బాలిక బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. అతను ముద్దు వీడియోను తీసి, కావాలనే సోషల్ మీడియాలో పెట్టాడు. మా అమ్మాయిని మభ్యపెట్టి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు అని వారు పేర్కొన్నారు. అయితే బాలుడి కుటుంబం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో ప్రేమలో ఉన్నారు. వీడియోను ఎవరు పెట్టారో తెలియదు అని వారు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల ప్రభావం పై ఆందోళన
ఈ సంఘటన యువతపై.. సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి తెలియజేసింది. చిన్న వయస్సులో ప్రేమ పేరుతో తీసుకునే నిర్ణయాలు అనేక సమస్యలకు దారి తీస్తున్నాయి. పాఠశాల, కాలేజీ వయసులోని పిల్లలు పబ్లిక్‌గా ఇలాంటి వీడియోలు తీసుకుని.. వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టడం సామాజిక మాద్యమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read: భౌ.. భౌ.. కుక్కలా మొరుగుతూ.. రేషన్ కార్డులో పేరు మార్చించుకున్నాడు, ఎందుకంటే?
ప్రస్తుతం పరిస్థితి
ప్రస్తుతం కొత్తవాడ గ్రామంలో పోలీసులు.. భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇరువర్గాలను విచారించి, టెక్నికల్ ఆధారాలతో పాటు వీడియో విశ్లేషణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.