IRCTC Offers: భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శ్రీ రామాయణ యాత్ర పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ 17 రోజుల యాత్ర జులై 25, 2025 న ప్రారంభమై.. శ్రీ రాముడితో సంబంధం ఉన్న 30 కంటే ఎక్కువ పవిత్ర ప్రదేశాలను సందర్శించనుంది. ఈ యాత్ర అయోధ్య నుంచి ప్రారంభమై.. రామేశ్వరం వరకు సాగి, ఢిల్లీకి తిరిగి వస్తుంది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ యాత్రను కొనసాగించనున్నారు. ఇందులో ఆధునిక సౌకర్యాలతో పాటు, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటాయి.
యాత్ర వివరాలు:
ఈ యాత్ర అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, సరయూ ఘాట్‌తో ప్రారంభమవుతుంది. తరువాత సీతామఢీ (బీహార్), జనక్‌పూర్ (నేపాల్), బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపీ, రామేశ్వరం వంటి ప్రదేశాలను సందర్శిస్తుంది. నాసిక్‌లో త్రయంబకేశ్వర ఆలయం, పంచవటి , హంపీలో అంజనేయ హిల్, విఠల, విరూపాక్ష ఆలయాలు, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడిలను కవర్ చేస్తుంది. ఈ యాత్ర మొత్తంగా 7,600 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుంది.
ప్యాకేజీ వివరాలు:
ప్యాకేజీ ధరలు రూ. 1,17,975 (3 ఏసీ), రూ. 1,40,120 (2 ఏసీ), రూ. 1,66,380 (1 ఏసీ క్యాబిన్), రూ. 1,79,515 (1 ఏసీ ) నుంచి ప్రారంభమవుతాయి. ఈ ధరలో రైలు ఛార్జీలు, 3-స్టార్ హోటళ్లలో వసతి, శాఖాహార భోజనం, ఏసీ బస్సుల ద్వారా రవాణా, బీమా, IRCTC టూర్ మేనేజర్ సేవలు కలిపి ఉంటాయి. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. గాజియాబాద్, అలీగఢ్, టుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో వంటి స్టేషన్లలో బోర్డింగ్ లు ఉన్నాయి.
ప్రాముఖ్యత:
అయోధ్యలో రామ జన్మభూమి ఆలయం ప్రారంభమైన తర్వాత.. ఈ ప్రాంతంలో ధార్మిక, సాంస్కృతిక పర్యాటకం గణనీయంగా పెరిగింది. ఈ యాత్ర శ్రీ రాముడి జీవితంతో ముడిపడిన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. అంతే కాకుండా భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుతుంది. ఈ యాత్ర భారతీయ రైల్వే యొక్క ధార్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగం. బుకింగ్ కోసం.. IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.