సాధారణంగా మనుషులు రోడ్డు దాటేందుకు వంతెనలు నిర్మిస్తారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తారు. అదే పీతలు రోడ్డు దాటేందుకు బ్రిడ్జి నిర్మిస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో పీతలకు కష్టం కలగకుండా ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్రిస్మస్ ఐలాండ్ లో క్రాబ్ బ్రిడ్జి ఏర్పాటు
ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐలాండ్ లో ఈ క్రాబ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ ఐలాండ్ లో ఎక్కుడగా ఎర్ర పీతలు ఉంటాయి. ఈ ప్రాంతం అత్యధిక రద్దీగా ఉంటుంది. ఈ రహదారిపై తరచుగా పీతలు వెళ్తుంటాయి. అదే సమయంలో వాహనాలు రావడంతో వేల సంఖ్యలో పీతలు చనిపోయేవి. ఈ నేపథ్యంలో వాటి ప్రాణాలు కాపాడేందుకు టూరిజం అధికారులు క్రాబ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం తర్వాత పీతలు ఎలాంటి హాని కలగకుండా దాటి వెళ్తున్నాయి. ఈ బ్రిడ్జి సుమారు 5 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. అంతేకాదు, వీటి కోసం 31 చోట్ల అండర్ పాస్ లు నిర్మించారు.
సేఫ్టీతో పాటు ప్రత్యేక ఆకర్షణ
ఓ వైపు పీతలకు ఇబ్బంది కలగకుండా కాపాడుతున్న ఈ బ్రిడ్జి, పర్యాటకంగానూ ఆకర్షణీయంగా మారింది. పీతలు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తుంటే చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నాట్లు క్రిస్మస్ ఐలాండ్ టూరిజం అసోసియేషన్ మార్కెటింగ్ మేనేజర్ లిండా కాష్ వెల్లడించారు. “సిడ్నీలో హార్బర్ బ్రిడ్జి, శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ, ప్రస్తుతం క్రిస్మస్ ఐలాండ్ లో నిర్మించిన క్రాబ్ బ్రిడ్జ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది” అని వెల్లడించారు.
వర్షాకాలంలో ఏకంగా 5 కోట్ల పీతల రాక
నిజానికి క్రిస్మస్ ఐలాండ్ లో పీతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో కొంతకాలం పాటు ఆ పీతలు బొరియల్లో నివసిస్తాయి. వర్షాలు వచ్చే సమయంలో బొరియల నుంచి సముద్ర తీరానికి చేరుకుంటాయి. ఈ పీతలు నడుస్తుంటే రోడ్లు, గోల్ఫ్ కోర్సు, బీచ్ లు ఎరుపు రంగును అద్దుకున్న తివాచీలా కనిపిస్తాయి. ఈ పీతలు గుడ్లు పెట్టడానికి వెళ్ళే మార్గం అంతటా అండర్ పాస్ లను కూడా నిర్మించారు. జనవరి 6న జరిగే వార్షిక వలసలో 50 మిలియన్లకు పైగా పీతలు పాల్గొంటాయని టూరిజం అసోసియేషన్ అంచనా వేసింది. ప్రతి వర్షాకాలం ప్రారంభంలో సుమారు 4 నుంచి 5 కోట్ల ఎర్ర పీతలు సముద్ర తీరానికి చేరుకుంటాయి. ఆ సమయంలోనే ఇవన్నీ గుడ్లు పెడతాయి. ఇందుకోసం తరలి వెళ్లే పీతలకు హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది క్రిస్మస్ ఐలాండ్ ప్రభుత్వం. చాలా మంది ఈ సమయంలో భూమి మీద పాకే ఎర్ర పీతలను చూసేందుకు పెద్ద మొత్తంలో పర్యాటకులు తరలి వస్తున్నారు. వర్షాకాలంలో క్రిస్మస్ ఐలాండ్ టూరిస్టులతో కళకళలాడుతుంది. పర్యాటకంగానూ ఈ ప్రాంతం మంచి ప్రగతి సాధిస్తుంది.
Read Also: ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!