Fake weddings in India: ఆహ్వానం ఉంది.. పెళ్లి కి రావాలంట. మేకప్ ఆర్టిస్టులు రెడీ, డిజైనర్ దుస్తులు సిద్ధం, ఫొటో షూటింగ్ సెటప్ కూడా రెడీ, డీజే మ్యూజిక్ ఊపందుకుంది, పెళ్లికొడుకు బారాత్ వచ్చేస్తోంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి అనేది ఒక్కటి నిజం కాదట! అవును, ఇది అసలైన పెళ్లి కాదు, కానీ అసలైన అంతటి హంగామా మాత్రం గ్యారంటీ! ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. ఇదెక్కడి ట్రెండ్ అని రాగాలు తీయవద్దు. అసలు విషయం తెలుసుకుంటే నోరెళ్ల బెడతారు.
అసలు ఈ ట్రెండ్ ఏమిటంటే?
ఇప్పటి ట్రెండ్ ఏమిటంటే.. ఫేక్ వేడింగ్స్. వధూవరులు లేకుండా జరిగే పెళ్లి విందులు. శుభలేఖలు లేవు, కంకణాలు కూడా లేవు. కానీ మండపాలు ఉన్నాయి, సంగీత్ డ్యాన్స్ లు ఉన్నాయి, పూల వర్షం ఉంది, చివరికి పెళ్లి జరిపించేందుకు వచ్చిన పండితుడు కూడా కూడా నటిస్తాడు. ఇది నిజమైన పెళ్లిలా అనిపించే భ్రమ ఇచ్చే ఓ కళాత్మకమైన వేడుక.
మన దేశంలో ఎక్కడెక్కడ?
ఢిల్లీ, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో ఇప్పటికే ఇది ఫుల్ హిట్. వారం చివరలో ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు వెడ్డింగ్ వేడుకలో మునిగిపోవాలన్నదే ఈ ట్రెండ్ ప్రధాన ఉద్దేశం. ఈ ట్రెండ్ పై మోస్ట్ ఫన్ ఐడియా అంటున్నారు యువత.
వస్త్రధారణ అంతా.. సేమ్ టు సేమ్
ఈ వేడుకల్లో పాల్గొనేవాళ్లంతా చీరలు, లెహంగాలు, షెర్వాణీలు వేసుకుని ఫోటోలు దిగి, రీల్స్ షేర్ చేస్తూ, డాన్సులతో స్టేజ్ ఊపేస్తారు. వెడ్డింగ్ బఫేలో చాట్ కౌంటర్లు, మెహందీ కార్నర్లు, థీమ్డ్ ప్లేలిస్టులు వంటివి ఉంటాయి. ఇవి అప్పుడప్పుడూ టికెట్‌తో పబ్లిక్ ఈవెంట్లుగా కూడా జరుగుతుండగా, కొన్ని సమయాల్లో కాలేజ్ క్యాంపస్‌ల్లో, రూఫ్‌టాప్ బార్లలో, ఫామ్‌హౌస్‌లలో ప్రైవేట్ పార్టీలుగా సాగుతున్నాయట.
అసలు కారణం ఇదేనట!
ఈ ఫేక్ మ్యారేజ్ సెలబ్రేషన్ల వెనుక ఓ కారణం ఉంది.. అవే ఆత్మీయత, సంస్కృతి, స్వేచ్ఛ. బాలీవుడ్ పెళ్లిళ్లలో పెరిగిన, షాదీ రీల్స్ చూస్తూ పెరిగిన యువతకు ఇవి ఒక కలలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి మరింత రిలాక్స్‌డ్, ఇన్‌క్లూసివ్, క్రియేటివ్ వేడుకలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఒక కోణంలో చూస్తే ఇవి ఓ కొత్త తరానికి చెందిందిగా అనిపించొచ్చు, కాని అసలు విషయాన్ని చూస్తే, ఇవి భారతీయ పెళ్లి సంస్కృతిని ఓ పండుగలా చూస్తున్న రకంగా ఉంటుంది. ఇక కొన్నిప్రాంతాల్లో, కాలేజీల్లో ఉదాహరణకు.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ కూడా ఇందులో భాగమై మల్టీ-డే మాక్ షాదీ నిర్వహించింది. ఇవి హల్దీ, మెహందీ, ఫేరాలు లాంటి సంప్రదాయాలను కలిపి గ్రాండ్ సెలబ్రేషన్లుగా జరుగుతున్నాయి.
వివాహాన్ని ఒక జీవిత బంధంగా కాకుండా.. ఒక ఎక్స్‌పీరియన్స్ గా తీసుకునే ఈ ట్రెండ్‌ను పార్టీ కల్చర్ గా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కలిసి నవ్వుతూ, డాన్స్ చేస్తూ, బంధాలు పెంచుకుంటూ.. తమ అభిరుచికి తగ్గట్టుగా పెళ్లి అనుభూతిని అనుభవిస్తున్నారు. ఫేక్ పెళ్లిలు అనే మాట వినగానే కొంత మంది షాక్ కు గురైనా, అసలు విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఇవి పెళ్లికి సంబంధించిన ఒత్తిడిని పక్కన పెట్టి, ఆనందాన్ని ఆస్వాదించాలనే ప్రయత్నమేనని యువత అంటోంది.
ఇప్పుడు చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. మన దేశంలో పెళ్లి ఖర్చు ఏ స్థాయిలో ఉందంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివాహాలపై మొత్తం దాదాపు $130 బిలియన్లు అంటే రూపాయలలో 10 లక్షల కోట్లకు పైగానే ఉందట. ఇది ఫుడ్, క్లాతింగ్ లాంటి మిగతా ఖర్చులతో పోల్చితే కూడా చాలా పెద్ద మొత్తం. అయితే ఈ ఫేక్ షాదీలు అలాంటి ఖర్చులు లేకుండానే అదే రీతిలో కళ, హంగులు అందిస్తూ సాంస్కృతిక ఆనందాన్ని అందిస్తున్నాయి.
ఇక ఈ వేడుకలు నాటి తరం విలువలను ప్రతిబింబిస్తున్నాయి. సామూహికత, చిత్తశుద్ధి, స్వేచ్ఛ, ఫన్ ఇవన్నీ ఈ ఫేక్ పెళ్లిలో నిండుగా కనిపిస్తున్నాయట. ఇవి పెళ్లి అనే సంప్రదాయాన్ని మరింత పాజిటివ్ గా అనుభవించే కొత్త మార్గమని, ఇది నిజంగా ఒక గొప్ప అనుభవం అనేస్తున్నారు నేటి యువత. మొత్తం మీద ఇది పెళ్లి కాకపోయినా.. సందడి మాత్రం అసలైనదే!