బంగారంతో తయారు చేసిన టాయిలెట్. అసలు మనం దీన్ని ఊహించగలమా..? కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన ఊహలను నిజం చేసే ఆర్టిస్ట్ ఒకరున్నారు. ఆయనే మౌరిజియో కాటెలాన్. ఈయన తయారు చేసిన బంగారు టాయిలెట్ ని 2019లో దొంగలు దోచుకెళ్లారు. ఆ దొంగలకు ఇప్పుడు అమెరికాలో జైలుశిక్ష పడింది. దొంగలు దొరికినా.. ఆ బంగారు టాయిలెట్ ని మాత్రం వారు రికవరీ చేయలేకపోవడం విశేషం. అప్పటికే దాన్ని ముక్కలు ముక్కలు చేసి విక్రయించారు.
టాయిలెట్ విలువ రూ.56కోట్లు
బంగారు టాయిలెట్ విలువ రూ.56 కోట్లు. దీన్ని 18 క్యారెట్ గోల్డ్ తో తయారు చేశారు. చిత్ర విచిత్రమైన వస్తువుల్ని తయారు చేస్తూ వాటిని ఆర్ట్ గ్యాలరీలో ఉంచే వైరల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ దీని రూపకర్త. 2019లో దీన్ని తయారు చేసి బ్రిటన్ లోని బ్లెన్ హీమ్ ప్యాలెస్ లో ఉంచారు. బ్లెన్ హీమ్ ప్యాలెస్ లో ఇలాంటి విచిత్రమైన ఆర్ట్ లు చాలానే ఉన్నాయి. వాటి మధ్య ఇది అత్యంత ఖరీదైనది. దీంతో దొంగలు కూడా దీనిపై కన్నేశారు. 56కోట్ల రూపాయల వస్తువుని కొట్టేయడమంటే మాటలా, దానికి ఎంత రక్షణ ఉంటుంది, ఆ సెక్యూరిటీని కూడా దాటుకుని జేమ్స్ షీన్ అనే గజదొంగ బంగారు టాయిలెట్ ని కొట్టేశాడు. దీనికోసం అతడు రెండు రోజులపాటు ఆ బ్లెన్ హీమ్ ప్యాలెస్ దగ్గర రెక్కీ నిర్వహించాడు.
5 నిమిషాల పని..
56కోట్ల రూపాయల విలువైన వస్తువుని దొంగతనం చేయాలంటే ఆ దొంగ ఎంత కష్టపడి ఉంటాడో అనుకుంటాం కదా, కానీ అతనికి అది 5 నిమిషాల పని. 5 నిమిషాల్లోనే దొంగతనం పూర్తి చేసి ఆ గోల్డెన్ కమోడ్ తో బయటపడ్డాడు దొంగ జేమ్స్ షీన్. ఈ దొంగతనంలో జోన్స్ అనే వ్యక్తి షీన్ కు సహకరించాడు. ఇన్నాళ్లకు ఈ కేసులో కోర్టు వారిద్దరికి శిక్షలు ఖరారు చేసింది. షీన్‌కు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, జోన్స్‌కు రెండు సంవత్సరాల మూడు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసుని “బోల్డ్ అండే బ్రేజెన్” దొంగతనం అని అభివర్ణించింది.
దాని పేరు అమెరికా..
వైరల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ ఇలాంటివి తయారు చేయడంలో అందెవేసిన చేయి. గోడలోకి గుర్రాలు దూసుకుపోయినట్టు, గోడలోనుంచి ఎవరో మనిషి బయటకు వచ్చినట్టు, చేతులకు ప్లాస్టర్లు వేసిన ఓ యువతి గోడకు వేలాడుతున్నట్టు.. ఇలాంటి కళాఖండాలను రూపొందించి వైరల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు కాటెలాన్. ఆయన గోల్డెన్ టాయిలెట్ ని తయారు చేయడమే కాదు, దానికి అమెరికా అనే పేరు పెట్టి మరింత సంచలనం సృష్టించారు. ఆ పేరుతోనే అది బాగా పాపులర్ అయింది. చివరకు బ్రిటన్ లోని ఆర్ట్ గ్యాలరీలో దాన్ని లాంఛ్ చేసిన ఐదు నిమిషాలకే అది మాయమైంది. దీంతో అది మరింత పాపులర్ అయింది. ఆ దొంగల చేతివాటానికి అందరూ అప్పట్లో షాకయ్యారు. సెక్యూరిటీని దాటుకుని మరీ వారు దాన్ని తీసుకెళ్లారు. అప్పటికే వారిపై చాలా నేరాలు మోపబడ్డాయి. ఆ తర్వాత పోలీసులకు దొరికినా తాము దొంగతనం చేసిన వస్తువుని మాత్రం తిరిగివ్వలేదు, దాని ఆచూకీ కూడా పోలీసులకు దొరకకుండా చేశారు. ముక్కలు ముక్కలుగా దాన్ని అమ్మేశారు.