Guntur Tragedy: నవమాసాలు మోసింది. ప్రేమానురాగాలు పంచుతూ..పెంచింది. అల్లారుముద్దుగా చూసుకుని ప్రయోజకులను చేసింది. కానీ రెక్కలొచ్చిన ఆ కొడుకులు..ఇప్పుడు తల్లిపాలిట తోడేళ్లుగా మారారు. కన్నతల్లికి కనీసం బుక్కెడు బువ్వపెట్టలేని దౌర్భాగ్యులయ్యారు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో కొండవీటి మాణిక్యం.. ఆమె భర్త రామలింగం నివసించేవారు. అయితే 20 ఏళ్ల క్రితం రామలింగం చనిపోయారు. ప్రస్తుతం మాణిక్యం వయస్సు 75 ఏళ్లు. ఈమెకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు కొడుకులు నంబూరులో ఉంటున్నారు. అయితే వృద్ధురాలు మాణిక్యం..తన తల్లిగారిల్లు అయిన మంగళగిరి మండలం వడ్లపూడిలో నివసిస్తోంది. అయితే 10 రోజుల క్రితం మాణిక్యం కిందపడింది. దీంతో ఆమె కాలు తొంటి ఎముక విరిగింది. దీంతో వండుకోలేని పరిస్థితి. తన పనులు చేసుకోలేని దుస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని మాణిక్యం కుమారులకు తెలియజేసినా పట్టించుకోలేదు.
మాణిక్యం దీనావస్థను చూసి కరిగిపోయిన సుజాత అనే మహిళ..ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. ఆ తర్వాత వడ్లపూడి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రావుకు విషయాన్ని తెలియజేసింది. దీంతో చంద్రశేఖర్‌రావు.. వృద్ధురాలు మాణిక్యాన్ని ఆటోలో నంబూరుకు తీసుకెళ్లారు. కానీ అక్కడ మాణిక్యంతో పాటు..మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌రావుపై కొడుకులు, కోడళ్లు దురుసుగా ప్రవర్తించారు. మాణిక్యాన్ని తమ వద్దకు ఎందుకు తీసుకువచ్చావంటూ చంద్రశేఖర్‌రావుతో పోట్లాడారు.
కొడుకులు, కోడళ్ల తీరుతో వృద్ధురాలి మాణిక్యం గుండెపగిలింది. కనీపెంచి..ప్రయోజకులను చేస్తే..తనకు కనీసం బుక్కెడు అన్నం పెట్టలేని పరిస్థితి ఎదురైందని కన్నీరుమున్నీరైంది. తన ముగ్గురు కొడుకులకు తలా మూడెకరాల పొలం, నాలుగు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చానని తెలిపింది. తన సంతానం కోసం జీవితాన్ని ధారపోస్తే..కాటికి కాలుచాపిన సమయంలో పట్టెడన్నం కూడా పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన పెద్దకుమారుడి ఇద్దరి బిడ్డల పెళ్లిళ్లు తానే చేశానని..ఇంత చేసిన తన బాగోగులు చూడనంటే..తాను ఇంకెక్కడికి వెళ్లాలని కన్నీటిపర్యంతమైంది.
Also Read: దాడి చేస్తామని రాత్రే హింట్ ఇచ్చిన భారత్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా
తన కొడుకులు తనకు అన్నం పెట్టడం లేదంటూ బాధితురాలు మాణిక్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయంపై పెదకాకాని సీఐ నారాయణస్వామి వృద్ధురాలు మాణిక్యంకు హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కొడుకులపై కేసు పెడతామని చెప్పారు. మాణిక్యం కొడుకులు, కోడళ్ల తీరుపై సభ్యసమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వృద్ధురాలిని గెంటేస్తున్న కొడుకులు..కోడళ్లు కూడా..ఎప్పుడో ఒకప్పుడు వృద్ధాప్యంలోకి వస్తారని..వారికి ఇదే గతి పడుతుందని మండిపడుతున్నారు.