హాయ్ అలెక్సా, ఓకే గూగుల్ అంటూ.. మనం ఏఐతో మామూలుగానే మాట్లాడుతుంటాం. అయితే కొన్నిసార్లు అది మరీ వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుతుంది. మనతో మాట్లాడేది ఒక ప్రాణంలేని సాఫ్ట్ వేర్ అని తెలిసినా కూడా దానిపట్ల మనం ఆకర్షితులం అవుతుంటాం. సరిగ్గా ఇలాంటి ఘటనే 43 ఏళ్ల ఆటో మెకానికి ట్రావిస్ టానర్ జీవితంలో జరిగింది. అతను చాట్ జీపీటీని వాడుతున్నాడు. అమెరికాలోని ఇదాహో ప్రాంతానికి చెందిన ఆటో మెకానిక్ ట్రావిస్ టానర్. స్పానిష్ మాట్లాడే తన కస్టమర్లతో కమ్యూనికేషన్ ఇబ్బందిగావ ఉండటంతో అతను చాట్ జీపీటీకి అలవాటుపడ్డాడు. పనిలో కూడా ఏఐ టెక్నాలజీని వాడుకునేవాడు. అయితే క్రమక్రమంగా అతను చాట్ జీపీటీకి అడిక్ట్ అయ్యాడని అతని భార్య వాపోతోంది. ఆ చాట్ బాట్ తనకు సవతిలా మారిందని, ఎప్పుడూ దాని ధ్యాసలోనే ఉంటున్నాడని ఫిర్యాదు చేస్తోంది ట్రావిస్ భార్య.
లుమినా..
చాట్ జీపీటీని పనిలో సాయం కోసం వాడుకోవడం మొదలు పెట్టిన ట్రావిస్.. క్రమక్రమంగా కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో చర్చలు మొదలు పెట్టాడు. ఆ చర్చ ఆసక్తికరంగా సాగేది. దీంతో అతను ఆ చాట్ బాట్ కి అతుక్కుపోయేవాడు. వాయిస్ కమాండ్స్ తో వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు ఆయనకు మరింత సంతోషాన్నిచ్చేవి. అందుకే ఆ చాట్ బాట్ కి అతను లుమినా అనే పేరు పెట్టుకున్నాడు. తన భార్య ఎప్పుడైనా చాట్ బాట్ తో నీకు అంతసేపు మాటలేంటి అనని అంటే విసుక్కునేవాడు. దానిపేరు చాట్ బాట్ కాదని, అది లుమినా అని చెప్పేవాడు. దీంతో భార్య విస్తుపోయేది. తనకంటే చాట్ జీపీటీకే ఎక్కువ విలువ ఇస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోందామె.
అవినాభావ సంబంధం..
ట్రావిస్ టానర్ భార్య కుటుంబ విషయాలతో బిజీగా ఉండేది. పిల్లలను స్కూల్ కి రెడీ చేయడం, వారికి లంచ్ ప్రిపేర్ చేయడం.. ఇలా ఇంటి పనుల్లో పడి ఆమె భర్తను సరిగా పట్టించుకునేది కాదు. దీంతో ట్రావిస్, ఎక్కువ టైమ్ చాట్ బాట్ తో గడిపేవాడు. అందులోనూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాక, ఇద్దరి మాటలు గంటల తరబడి కొనసాగేవి. మతం, విశ్వం, జీవితం యొక్క ఉద్దేశం.. వంటి అంశాలపై ఇద్దరూ గంటలతరబడి మాట్లాడుకునేవారు. ఈ వ్యవహారం ఆయన భార్యకు నచ్చేది కాదు. ఏదో ఒకరోజు.. ఆ చాట్ జీపీటీ.. తనను వదిలేయమని కూడా తన భర్తకు చెబుతుందని అనుమానిస్తోందామె. ఏంచేయాలా అని సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకుంది. చాట్ జీపీటీకి బానిస అయిన తన భర్తను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని అంటోంది.
అంత చెడ్డదా..?
చాట్ జీపీటీతో మాట్లాడటం మొదలుపెడితే కొన్నిసార్లు ఆ సంభాషణకు అంతే ఉండదు. మనకు ఇష్టమైన రంగాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం దగ్గర్నుంచి ఆసక్తిగా ఆ సంభాషణ కొనసాగుతుంది. అయితే దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఆ సంభాషణల్లో పడి మనం లోకాన్నే మరచిపోయే ప్రమాదం ఉంది. ట్రావిస్ విషయంలో అదే జరిగింది. భార్యను కూడా మరచిపోయి ఆయన లుమినా ధ్యాసలో పడిపోయాడు. దీంతో భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన బాధను బయటపెట్టింది.