Emirate Draw Retired Engineer| ఒక రిటైర్డ్ ఇంజినీర్ కళ్లు మూసుకొని కొట్టిన నెంబర్లు అతనికి రూ.225 కోట్లు సాధించిపెట్టాయి. ఇది చూసి అతను నమ్మలేకపోయాడు. ఇది నిజంగానే జరిగిందా.. అని ఆశ్చర్యపోయాడు. చెన్నైలో నివసించే రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్‌కు ఒక సాధారణ ఫోన్ ట్యాప్.. అతడి జీవితాన్ని మార్చివేసింది. యుఎఈ దేశానికి చెందిన ‘ఎమిరేట్స్ డ్రా మెగా7 లాటరీ’లో ఆయన ఏకంగా ₹225 కోట్లు (సుమారు $27 మిలియన్ లేదా 100 మిలియన్ దిర్హామ్స్) గెలుచుకున్నారు. యుఎఈ లాటరీ చరిత్రలో ఒక భారతీయుడు ఇంతటి భారీ బహుమతి గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది.
శ్రీరామ్ సౌదీ అరేబియాలో 20 సంవత్సరాలకు పైగా పనిచేసి, 2023లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చెన్నైకి తిరిగి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. లాటరీలో పాల్గొని చాలా రోజులైనా, మళ్లీ ఒకసారి అదృష్టాన్ని పరీక్షించాలని ఇటీవల నిర్ణయించారు. అందుకే మార్చి 16న ఆయన మొబైల్ ద్వారా ఎంచుకున్న నంబర్లు.. విన్నింగ్ లాటరీ నంబర్లతో సరిపోయాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శ్రీరామ్ దీనికోసం తన ఫోన్‌లో కళ్లు మూసుకుని, యాదృచ్ఛికంగా నంబర్లను ఎంచుకున్నారు.
ఆ తరువాత ఫలితాలు చూసినప్పుడు శ్రీరామ్ తన కళ్లను నమ్మలేకపోయారు. “నేను డ్రా వీడియోను మళ్లీ చూశాను, గెలుపు నంబర్ల స్క్రీన్‌షాట్ కూడా తీసుకున్నాను,” అని ఆయన ఖలీజ్ టైమ్స్ వార్తా ప్రతికతో చెప్పారు. ఈ భారీ బహుమతి గురించి మాట్లాడుతూ.. “70 శాతం సంతోషం, 30 శాతం భయం” అనిపించిందని చెప్పారు. “ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఎప్పుడూ నిర్వహించలేదు. ఇది నాకు మాత్రమే కాదు, నా కుటుంబం, పిల్లలు, ఈ కథ చదివే ప్రతి ఒక్కరికీ ఒక ఆశాకిరణం. ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలని కలలు కంటాడు. ఇప్పుడు నేను ఆ కలను నిజం చేయగలను. ఇది తరతరాల సంపదను నిర్మించే అవకాశం,” అని ఆయన అన్నారు.
చెన్నైలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు శ్రీరామ్. 1998లో సౌదీ అరేబియాకు వెళ్లి, అక్కడే తన కుటుంబంతో సహా స్థిరపడ్డారు. తన భార్యతో కలిసి ఇద్దరు కుమారులను పెంచారు. 2023లో రిటైర్ అయిన తర్వాత, చెన్నైలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ అద్భుతమైన లాటరీ గెలుపు ఆయన జీవితాన్ని మార్చేసింది.
Also Read: యువకుడి తలపై పెద్ద కాక్రోచ్.. తొలగించడానికి వెళ్లిన యువతికి షాక్.. అది సామాన్యమైనది కాదు
ఈ డబ్బుతో ఆయన ఏం చేయబోతున్నాడనే విషయంపై శ్రీరామ్ ఇంకా స్పష్టమైన ప్రణాళికలు వెల్లడించలేదు. అయితే, కొంత భాగం దానధర్మాల కోసం వినియోగిస్తానని చెప్పారు. “నేను సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. ఈ డబ్బు నా జీవితాన్ని మార్చేయవచ్చు, కానీ నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు,” అని ఆయన అన్నారు.
టైకెరోస్ సంస్థ నిర్వహించే ఈ ఎమిరేట్స్ డ్రా లాటరీ, 2023 చివరిలో యూఏఈలో కొత్త నిబంధనల కారణంగా తమ కార్యకలాపాలను ఆ దేశంలో నిలిపివేసింది. కానీ ఆన్ లైన్ ద్వారా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది.