పాములు కాటు వేయడానికి చాలా కారణాలు ఉంటాయి. తమను తాము రక్షించుకోవడం కోసం, లేదంటే భయపడి కాటు వేస్తుంటాయి. అయితే, చాలా సందర్భాల్లో తొలిసారి కాటు వేసినప్పుడు విషయం విడుదల చేయవు. ఇలా చేయడాన్ని డ్రై బైట్ అని పిలుస్తారు. పాము జాతి, పరిస్థితి, దాని ఉద్దేశంపై ఆధారపడి పాము కాటు అనేది ఉంటుంది.
ఫస్ట్ కాటులో విషం ఎందుకు ఉండదు?
⦿ తమను తాము కాపాడుకోవడం: పాము తనను తాను కాపాడుకోవడానికి కాటు వేస్తే, అది తక్కువ విషాన్ని లేదంటే విషం లేకుండా కాటు వేసే అవకాశం ఉంటుంది. మన దేశంలో రస్సెల్ వైపర్ (Russell’s Viper) కాటులో 30 నుంచి 40 శాతం సందర్భాలలో డ్రై బైట్ ఉంటుంది. 2023లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయం తేలింది.
⦿ విష నియంత్రణ: వైపర్స్, కోబ్రాలు లాంటి విషపూరిత పాములు తమ విషాన్ని కంట్రోల్ చేసుకుంటాయి. ఆహారం కోసం కాటు వేసినప్పుడు ఎక్కువ విషాన్ని విడుదల చేస్తాయి. కానీ, మనిషిని ఆహారంగా భావించనప్పుడు తక్కువ లేదంటే విషం లేని కాటు వేస్తాయి.
⦿ విషం అయిపోవడం: పాము అంతకు ముందే మరొక జంతువును కాటు వేసి ఉంటే, దాని విష గ్రంథులు ఖాళీగా ఉంటాయి. మళ్లీ విషం నిండేందు కొంత సమయం పడుతుంది. దీని వల్ల కాటు వేసినా, విషం అనేది విడుదల కాకపోవచ్చు.
అన్ని పాములు డ్రై బైట్ వేస్తాయా?
⦿ విషపూరిత పాములు: రస్సెల్ వైపర్, కోబ్రా, క్రైట్ వంటివి డ్రై బైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, నూటికి నూరుశాతం ఇస్తాయనే గ్యారెంటీ ఏమీ లేదు. కొన్ని పాములు, ముఖ్యంగా క్రైట్‌లు, చిన్న కాటుతోనే విషాన్ని ఇంజెక్ట్ చేయగలవు.
⦿ విషం లేని పాములు: రాట్ స్నేక్, పైథాన్లు విషం లేనివి. సో, వీటి కాటు సాధారణంగా డ్రై బైట్‌గానే ఉంటుంది. కానీ గాయం అవుతుంది. ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.
డ్రై బైట్ ఎలా గుర్తించాలి?
డ్రై బైట్ వేసినప్పుడు తేలికపాటి నొప్పి, ఎరుపు, వాపు మాత్రమే ఉంటాయి. విష లక్షణాలు (మైకము, వాంతులు, శ్వాస ఆడకపోవడం) కనిపించవు. విషపూరిత కాటు అయితే, 10 నుంచి 30 నిమిషాల్లో తీవ్రమైన లక్షణాలు (కోబ్రా విషం వల్ల కండరాల బలహీనత, క్రైట్ వల్ల నిద్రమత్తు) కనిపిస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పాము కాటు వేసినప్పుడు డ్రై బైట్ అని ఊహించి నిర్లక్ష్యం చేయవద్దు. ఏ పాము కాటైనా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. విషం తక్కువగా ఉన్నా ఆలస్యం ప్రమాదకరం. దేశంలో సంవత్సరానికి 58,000 మంది పాము కాటు వల్ల మరణిస్తారని WHO 2023 లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా రస్సెల్ వైపర్, క్రైట్, కోబ్రా లాంటి విషపూరిత పాములు కరుస్తాయని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వరి పొలాల్లో, వర్షాకాలంలో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతాయి. పాములు ఉన్న ప్రాంతాల్లో బూట్లు ధరించి నడవడం మంచిది. రాత్రి సమయంలో టార్చ్ లైట్ వాడాలి. పామును చూసినా దానిని చిరాకు పెట్టకుండా దూరంగా ఉండాలి. పాములు సాధారణంగా మనుషులను కరవడానికి ఇష్టపడవు. కానీ, ముప్పు ఉందని భావిస్తేనే దాడి చేస్తాయి. అందుకే, వాటికి దూరంగా ఉంటే, అవే వెళ్లిపోతాయి.
Read Also: వామ్మో.. నది నిండా అనకొండలు.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!