Juice Seller IT Notice| ఇటీవల తమిళనాడులో ఓ పానీ పూరి విక్రేతకు, తెలంగాణలో ఓ భవన నిర్మాణ కూలీకి లక్షల్లో జిఎస్టీ పన్ను నోటీసులు వచ్చాయాని వార్తలు.. దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ రెండు ఘటనలు మరవకముందే తాజాగా ఒక జ్యూస్ సెంటర్ నడుపుకుంటున్న ఒక చిరు వ్యాపారికి కోట్లలో పన్ను నోటీస్ వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగడ్ ప్రాంతంలో ఓ చిన్న ఫ్యూట్ జ్యూస్ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పేద వ్యక్తి ఆదాయ పన్ను శాఖ ఏకంగా రూ.7.7 కోట్ల ఐటి నోటీస్ జారీ చేసింది. ఆ నోటీసుల్లో ఏముందో కూడా చదవలేని ఆ వ్యాపారి దాని గురించి ఇతరుల ద్వారా తెలసుకొని నిర్ఘాంతపోయాడు.
వివరాల్లోకి వెళితే.. అలీగడ్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఓ చిన్న జ్యూస్ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు మహమ్మద్ రయీస్. అతని వయసు దాదాపు 45 ఏళ్లు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కానీ రయీస్ ఒక్కడి ఆదాయం తోనే ఇల్లు గడవాలి. రయిస్ ఒక రోజుకు సగటున రూ.400 నుంచి రూ.500 సంపాదిస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు ముసలితనం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అతనికి మార్చి 18, 2025న ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏకంగా రూ.7.7 కోట్ల ఐటి నోటీస్ అందింది.
ఆ నోటీస్ లో ఏముందో తెలియక.. కోర్టులో తనకు తెలిసిన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. అందులో తన గురించి ఏముందో చెప్పాలని కోరాడు. అయితే ఆ స్నేహితుడు నోటీసు వివరాలను చదువుతుండగా.. రయీస్ కు నమ్మశక్యం కాలేదు. తనకు రూ.కోట్లలో ఐటి నోటీస్ రావడమేంటని ప్రశ్నించాడు. అయితే ఈ నోటీస్కు మార్చి 28 లోపు సమాధానం ఇవ్వాలని ఉంది. ఈ విషయం తెలిసి రయీస్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నాడు. తనను ఆ స్నేహితుడు ఒక మంచి ఇన్ కమ్ ట్యాక్స్ తెలిసిన లాయర్ ని కలవమని సలహా ఇచ్చాడు. తన బ్యాంకు అకౌంట్ డాకుమెంట్స్ కూడా ఇవ్వాలని సూచించాడు. రోజూ జ్యూస్ కొట్టు నడపనిదే.. ఇల్లు గడవని రయీస్.. దుకాణం మూసుకొని ఈ లాయర్ల చుట్టూ తిరగలేనని భయపడుతున్నాడు.
Also Read: పగలు పాఠాలు చెప్పే టీచర్ ఉద్యోగం.. రాత్రి ఆన్ లైన్‌లో అందాల ఆరబోత
అయితే ఈ విషయంపై ఐటీ అధికారులను మీడియా సంప్రదించగా.. రయీస్ పేరు మీద పంజాబ్ లో రూ.7.7 కోట్ల లావాదేవీలు జరిగాయని.. ఇందుకోసం రయీస్ పాన్ కార్డుని ఉపయోగించారని తెలిపారు. తమ డేటా రయీస్ పాన్ నెంబర్ పై భారీగా లావాదేవీలు జరిగినట్లు తెలియడంతోనే అతనికి నోటీసలు ఇచ్చామని ఐటి అధికారి నయిన సింగ్ వెల్లడించారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలానికి చెందిన నిరుపేద కూలీ జానపాటి వెంకటేశ్వర్లుకు జీఎస్టీ పన్ను చెల్లించాలని.. విజయవాడలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయం నుంచి ఇటీవల నోటీసు అందింది. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో కోట్ల రూపాయల గ్రానైట్ వ్యాపారం చేసినట్లు నోటీసులో పేర్కొంది. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ వెంకటేశ్వర్లు పేరు మీదే ఉండడంతో అతని నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. అయితే వెంకటేశ్వర్లు తాను ఎలాంటి వ్యాపారం చేయలేదని, తన పేరు మీద వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నాడు. తనకు తెలియకుండా ఎవరో తన ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు తీసుకొని, వ్యాపారం చేసినట్లు అతనికి తెలిసింది. తాను కేవలం 6 నెలల క్రితమే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపాడు.