Long last Father | ప్రపంచంలో చాలా వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో మనిషి జీవితంలోనైనా భావోద్వేగానికి గురైన క్షణాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ క్షణాలు హృదయాన్ని కదిలిస్తాయి. తాజాగా అలాంటిదే ఒక ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కారణంగా తప్పిపోయిన ఒక తండ్రి కోసం వెతుకుతున్న కూతుర్లకు ఆయన ఒక్కసారిగా కళ్లముందు కనిపించేసరికి వారు నమ్మలేకపోయారు. అయితే ఆ తండ్రికి మానసిక స్థితి సరిగా లేని కారణంగా ఆయన వారిని గుర్తు పట్టడంలో ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన బాలయ్య అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక ఆరేళ్ల క్రితం తప్పిపోయాడు. ఆయన కోసం ఇద్దరు కూతుళ్లు లావణ్య, దివ్య చాలా కాలంగా వెతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో గత కొన్ని నెలలుగా తండ్రి పేరుతో అన్నదానం చేస్తూ ఉన్నారు. అనాధాశ్రమం నిర్వహకులకు వారిద్దరూ తమ తండ్రిని వెతికిపెట్టమని చాలాసార్లు కోరారు.
Also Read: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..
విచిత్రమేమిటంటే ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై ఒంటరిగా తిరుగుతూ ఉన్న బాలయ్యను మాతృదేవోభవ అనాధాశ్రమం కార్యకర్తలు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన అనాధాశ్రమంలోనే ఉన్నారు. అయితే రెండు నెలల క్రితం ఆయన ఫొటో, వివరాలు అనాధాశ్రమం నిర్వహకులకు లావణ్య, దివ్య చూపించి.. తమ తండ్రిని వెతికి పెట్టమని కోరారు. అది చూసిన నిర్వహకులు కొంత కాలంపాటు వారిద్దరినీ గమినించారు. మతిస్థిమితం కోల్పోయి వృద్ధావస్థలో ఉన్న తండ్రిని నిజంగానే కూతుర్లిద్దరూ సరిగా చూసుకుంటారో లేదో? అని వారి గురించి పరిశీలించారు. వారు చూసుకోగలరు అని నిర్ధారణకు వచ్చాక.. ఇద్దరినీ పిలిచి.. వారి బాలయ్యను వారి ముందు నిలబెట్టారు.
దీంతో ఆరు సంవత్సరాలుగా వెతుకుతున్న తండ్రిని కళ్లెదుటే చూసి ఆ కూతుర్లిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. తమ తండ్రిని వెంటనే వెళ్లి వాటేసుకున్నారు. కానీ బాలయ్య వారిని వెంటనే గుర్తించలేదు. ఆ యువతులిద్దరూ తనను నాన్న పిలుస్తుంటే బాలయ్య విచిత్రంగా వారివైపు చూస్తుండిపోయాడు. కానీ దివ్య, లావణ్యకు మాత్రం తండ్రిని చూసిన ఆనందంలో కన్నీరు ఆగడం లేదు. బాలయ్య కంగారు పడడం చూసి అనాధాశ్రమం నిర్వహకులు కలుగజేసుకున్నారు. ఆయనను శాంతపరిచి విషయం వివరించారు. ఆ తరువాత బాలయ్య తన కూతుర్లు, మనమళ్లతో మాట్లాడారు. చివరికి అనాధాశ్రమంలోని తన స్నేహితులకు వీడ్కోలు చెప్పి తన కూతుళ్లతోపాటు వెళ్లారు.
ఈ భావోద్వేగమైన వీడియోకు 24 గంటల్లోనే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కంటతడి పెట్టించే సన్నివేశం
మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని ఆరేళ్ల తర్వాత అనాధాశ్రమంలో చూసి కూతుళ్ల భావోద్వేగం
హైదరాబాద్లోని మాతృదేవోభవ అనాధాశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్లిన కూతుళ్లు
మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి గుర్తుపట్టిన కూతుళ్లు… pic.twitter.com/zK0MdEHlJF
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024