మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో నందని అనే ఊరు ఉంది. అక్కడ మాధురి అనే ఏనుగు ఉంది. ఈ ఏనుగు అక్కడి జైనమఠం ఆధ్వర్యంలో ఉంది. మూడేళ్ల వయసు నుంచి అక్కడే పెరిగింది. అక్కడి గ్రామస్తులు ఆ ఏనుగు మీద ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఆ ఏనుగు కూడా ఆ ఊరి ప్రజలను తన తొండంతో దీవిస్తూ ఆశీర్వదించేది. ఎంతో ప్రేమగా ఉండేది. రీసెంట్ గా ఆ ఏనుగును సంరక్షణశాలకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పెటా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఓకే చెప్పింది. సుప్రీం ఆదేశాలతో ఏనుగును గుజరాత్ జామ్ నగర్ లోని వంటారా ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. .
మాధురిపై కోర్టులో కీలక వాదోపవాదాలు
ప్రస్తుతం మాధురి వయసు 34 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతుందని పెటా కోర్టుకు తెలిపింది. ఏళ్ల తరబడి నిర్భందం కారణంగా దీర్ఘకాలిక ఆర్థరైటిస్, పాదాలకు సమస్యలతో ఇబ్బంది పడుతుందని చెప్పుకొచ్చింది. గట్టి నేల మీద పడుకుని బాధపడుతుందని వివరించింది. మాధురిని అభయారణ్యానికి తరలించడం వల్ల ఆరోగ్యం కోలుకునే అవకాశం ఉందని వాదించింది. వారి వాదన సమర్థిస్తూ ఏనుగును సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఆదేశించింది. రవాణా సమయంలో మాధురికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది.
వెళ్లిపోతున్న ఏనుగును చూసి కంటతడి పెట్టిన గ్రామాస్తులు
సుప్రీంకోర్టు తీర్పుతో సదరు ఏనుగును గుజరాత్ లోని వంతారా రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ కు తరలించారు. ఏనుగును తరలించే సమయంలో గ్రామస్తులతో పాటు ఆయల పండితులు మాధుని చూసి కంటతడి పెట్టారు. ఇన్నేళ్లు తమతో కలిసి ఉన్న ఏనుగు వెళ్లిపోవడాన్నీ జీర్ణించుకోలేకపోయారు. ఏనుగు కూడా కంటతడి పెట్టి తన బాధను వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద వీడ్కోలు ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వంతారాకు లేఖ రాసిన కొల్హాపూర్ గ్రామస్తులు
చివరికి మాధురిని అధికారులు వంతారాకు తరలించారు. అక్కడ ఈ ఏనుగు గొలుసులు లేకుండా జీవించనుంది. ప్రత్యేక పశువైద్యల సంరక్షణలో ఉంటుంది. డాక్టర్లు హైడ్రోథెరపీతో సహా, ఆర్థరైటిస్ సమస్యకు చికిత్స అందించనున్నారు. అటు తమతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్న మాధురిని మళ్లీ వెనక్కి పంపించాలని గ్రామస్తులు వంతారాకు లేఖ రాశారు. “మాధురి మాకు కేవలం ఏనుగు మాత్రమే కాదు. కుటుంబం లాంటిది. సంవత్సరాలుగా కొల్హాపూర్ నందనిలో నివసించింది. మాధురి లేకపోవడం మా గ్రామ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మీరు చూపిస్తున్న శ్రద్ధను నిజంగా అభినందిస్తున్నాము. కానీ ఆమె నిజమైన ఇల్లు కొల్హాపూర్‌లో ఉంది. ప్రజల మధ్య తన జ్ఞాపకాలను గుర్తించి, మాధురిని తిరిగి పంపించాలని కోరుకుంటున్నాం” అని గ్రామస్తులు లేఖ రాశారు. మాధురి నందానిని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ, తమ జ్ఞాపకాలను మర్చిపోలేదని వెల్లడించారు.
Read Also: మొదటిసారి శాఖాహారం తిన్న సింహం.. దాని ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. గంట నవ్వుతారు!