NRI Railway Free Wheel Chair | డాలర్లలో సంపాదించే ఎన్నారైల నుంచి ఎంతైనా వసూలు చేయొచ్చన్న భావన ఓ పోర్టర్ కొంప ముంచింది. చివరకు తన ఉపాధినే కోల్పోయేలా చేసింది. వీల్ చైర్ కోసం ఓ ఎన్నారై నుంచి ఏకంగా రూ.10 వేలు వసూలు చేసిన ఓ పోర్టర్‌ను తాాజాగా రైల్వే అధికారులు తొలగించారు. అతడి పోర్టర్ బ్యాడ్జిని రద్దు చేసి మళ్లీ రైల్వే స్టేషన్‌లో కాలుపెట్టలేని విధంగా శిక్షించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, లండన్‌లో ఉండే పాయల్ ఇటీవల తన కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ఆమె స్వస్థలం గుజరాత్. తన తల్లిదండ్రులు రితేశ్, సంధ్య, భర్త సామ్యుయెల్‌తో కలిసి ఆమె డిసెంబర్ 21న ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దిగారు. ఈ క్రమంలో ఆమె తండ్రి కోసం వీల్ చైర్ కావాలని రైల్వే స్టేషన్‌లో ప్రయత్నించింది. దీనికోసం రైల్వే స్టేషన్ లో ఒక పోర్టర్ (రైల్వే కూలీ)ని సంప్రదించింది. కానీ ఆ పోర్టర్ ఆమెను దారుణంగా మోసం చేశారు. వీల్ చైర్‌తో కలిపి లగేజీ తీసుకెళ్లేందుకు ఏకంగా రూ.10,000 అవుతుందని ఆ పోర్టర్ అడిగాడు. ఇది విని చాలా ఎక్కువని భావించింది. కానీ ఆ పోర్టర్ ఇదే రేటు అని చెప్పడంతో.. ఆమె ఇదంతా సాధారణమేమో అని అనుకుని పోర్టర్ అడిగిన మొత్తాన్ని ఇచ్చి బయటకు వచ్చింది.
Also Read: ఇంట్లో దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
తాజ్‌మహల్ సందర్శించాలనుకున్న వారు ఆగ్రాకు వెళ్లారు. అక్కడ టూర్ సందర్భంగా పాయల్.. పోర్టర్‌కు ఇచ్చి పది వేల గురించి డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడితో అన్యాపదేశంగా ప్రస్తావించింది. అది విని అతడు షాకైపోయాడు. పోర్టర్ ఆమెను దారుణంగా మోసగించాడని గుర్తించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో ఉచితంగానే వీల్ చైర్ అందుబాటులో ఉంటుందని వివరించాడు. నిబంధనల ప్రకారం, పోర్టర్లు సామాన్లు తరలించేందుకు కొద్ది మొత్తంలోనే డబ్బు తీసుకోవాలని అన్నాడు. దీంతో, దిగ్భ్రాంతికి గురైన పాయల్, ఆమె భర్త సామ్యుల్ వెంటనే ఆగ్రా స్టేషన్‌లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరుక్షణం రంగంలోకి దిగిన జీఆర్‌పీ పోలీసులు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మేనేజ్మెంట్‌కు సమాచారం అందించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీ జల్లెడపట్టి పోర్టర్ ఆచూకీ కనుక్కున్నారు. అతడి మోసం కెమెరాల్లో రికార్డు కావడంతో నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు పోర్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రూ.9 వేలను ఎన్నారైలకు ఇప్పించారు.
మరోవైపు, ఘటనపై స్పందిస్తూ ఉత్తర రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది. సదరు రైల్వే పోర్టర్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడి పోర్టర్ బ్యాడ్జీ, లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తాము ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
‘‘ఈ ఘటనతో రైల్వే ఇమేజీ మసకబారింది. ప్రయాణికుల నమ్మకం సన్నగిల్లింది. ఈ మోసాలను మేము అస్సలు సహించం. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని రైల్వే ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు, మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
సమస్య ఎదురైన వెంటనే ప్రయాణికులు 139కు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు తెలిపారు. అప్పుడే సమస్యకు తక్షణ పరిష్కారం లభించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు.