మనసుకి నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమించడం పాత పద్ధతి, అంద వికారంగా ఉన్నా సరే ఐలవ్యూ చెప్పేయడం కొత్త పద్ధతి. అయితే ఈ ట్రెండ్ ఇండియాలో ఇంకా ఫేమస్ కాలేదు కానీ.. విదేశాల్లో దీన్ని ఫాలో అవుతున్నవారు చాలామందే ఉన్నారు. దాన్ని ‘ష్రెక్కింగ్’ అంటారు. అందంలో తమకి ఏమాత్రం సరితూగరు అనుకునేవారికి ఐలవ్యూ చెప్పి డేటింగ్ కి ఆహ్వానించడమే ‘ష్రెక్కింగ్’. దీనివల్ల అవతలి వాళ్లు తమని వదిలేసి వెళ్తారనే అభద్రతా భావం ఉండదట. అదే సమయంలో అన్నిట్లోనూ మనదే డామినేషన్ అవుతుందట. అందుకే ‘ష్రెక్కింగ్’ కి సై అంటున్నారు యువత.
అలా మొదలైంది..?
‘ష్రెక్కింగ్’ అనే పేరు, ఆ ట్రెండ్ ష్రెక్ అనే యానిమేయెడ్ సినిమా నుంచి వచ్చాయి. ఆ మూవీలో ప్రిన్సెస్ ఫియోనా, రాక్షసుడైన ష్రెక్ మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ష్రెక్ అందవికారంగా ఉండే రూపం చూసి కూడా ప్రిన్సెస్ ప్రేమలో పడటం ఇక్కడ విశేషం. ఇదే ష్రెక్కింగ్ ట్రెండ్ కి దారితీసింది. అందంలో, ఆకర్షణలో తమకు ఏమాత్రం సరిపోరు అనే వారిని ఏరికోరి వారితో డేటింగ్ చేయడం ష్రెక్కింది. ఇప్పటికే ఇది ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలామంది తాము ష్రెక్కింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు.
ఫలానా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బాగుంటాడు, ఫలానా అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది అనే మాటలు ఈ ట్రెండ్ లో వినపడవు. అదే సమయంలో వారిపై సింపతీ చూపిస్తూ మాట్లాడే పరిస్థితి వస్తుంది. అయినా కూడా ఆ మాటల్ని పాజిటివ్ గా తీసుకోవడమే ఈ ‘ష్రెక్కింగ్’ ట్రెండ్ అంతరార్థం. జీవితంలో ఇక తమకు తోడు ఎవరూ దొరకరు, తమని అభిమానించేవారు, ఆరాధించేవారు ఉండరు అనుకునే వారికి ‘ష్రెక్కింగ్’ ఓ వరం అని చెప్పాలి. అలాంటి వారందరికీ ఈ ట్రెండ్ లో ‘ష్రెక్కింగ్’ జంటలు దొరికేస్తాయి.
నిపుణుల మాటేంటి?
ఈ ట్రెండ్ ప్రమాదకరం అంటున్నారు మానసిక నిపుణులు. ఎవరైనా ముందుగా బాహ్య ఆకర్షణతోనే ప్రేమలో పడతారని, ఆ తర్వాత మానసిక అంశాలు ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. కానీ బాహ్య ఆకర్షణ ఏమాత్రం ఈ ష్రెక్కింగ్ లో ఉండదు. సో, ఇక్కడ ఆ ఆకర్షణ బలం తక్కువగా ఉంటుందనమాట. అందుకే బంధం కూడా తక్కువ రోజుల్లోనే ముగిసిపోతుందని అంటున్నారు. ఇలాంటి వారు మానసిక సమస్యల బారిన పడతారని కూడా అంటున్నారు. డేటింగ్ లో కొత్త ట్రెండ్ అంటూ కొంతమంది కావాలని ఇలాంటి జోడీలను వెదుక్కుంటున్నారని, అయితే ఇది ఎక్కువ కాలం మనుగడ సాగించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
మొత్తమ్మీద అసలు డేటింగ్ అనేది ఎందుకు మొదలవుతుందో ఆ ప్రాథమిక కారణమే ఇప్పుడు కనపడకుండా పోతుందనమాట. ష్రెక్కింగ్ పేరుతో ఆకర్షణీయంగా లేని వారితో డేటింగ్ చేయడం అనే కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. సినిమాల వల్లనో, యానిమేటెడ్ మూవీస్ వల్లనో ఇది తెరపైకి వచ్చినా, ఆచరించేది మాత్రం సాధారణ యువతీ యువకులే. అయితే వీరి మానసిక స్థితి ఇక్కడ ప్రధానంగా ప్రభావితం అవుతుంది. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు ఉండదనేది నిపుణులు చెబుతున్న మాట.