Influencer Chugs Two Whisky Bottles In 20 Min| యూట్యూబ్ కంటెంట్ కోసం వేసిన చిన్న పందెం.. ఒక వ్యక్తి ప్రాణం తీసింది. 75 వేల రూపాయల కోసం ఆ యూట్యూబర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇందులో ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. ఆ యూట్యూబర్ కింద పడి చనిపోతున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్లు పట్టించుకోలేదు. చప్పట్లు కొడుతూ, నవ్వుతూ పార్టీ ఎంజాయ్ చేశారు.
ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న చెత్త నిర్ణయాల ఫలితాలు మనం ఊహించని విధంగా ఉంటాయి. థాయ్‌ల్యాండ్‌లోని థా మాయ్ జిల్లా చంతబురి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఇదే జరిగింది. అతను ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో సరదాగా జోకులు పేల్చడానికి అక్కడి ఫేమస్ కామెడీ యూట్యూబర్ ‘బ్యాంక్ లీసెస్టర్’ను పిలిచాడు. బ్యాంక్ లీసెస్టర్ అసలు పేరు తనకరన్ కాంథీ(21) . మానసిక వికలాంగుడైన (విచక్షణా శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి) కాంథీ.. గతంలో ఎన్నోసార్లు యూట్యూబ్ వీడియోల కోసం వింత వింత పనులు చేశాడు.
Also Read: 40 ఏళ్లుగా ఒకే భర్త నుంచి 12 సార్లు విడాకులు తీసుకున్న మహిళ.. తలలు పట్టుకున్న అధికారులు!
డబ్బులు ఇస్తామని ఛాలెంజ్ చేస్తే హ్యాండ్ శానిటైజర్ తాగేయడం వంటి పనులు చేసేవాడు. అలాగే ఆ పార్టీకి వెళ్లిన అతనికి ఆ పార్టీ హోస్ట్ ఒక ఛాలెంజ్ విసిరాడు. 350 మిల్లీలీటర్ల రీజెన్సీ విస్కీ బాటిల్ తాగేస్తే పది వేల థాయ్ బాత్ ఇస్తానన్నాడు. ఇది మన రూపాయల్లో పాతిక వేలకు కొంచెం ఎక్కువ. అలా మూడు బాటిల్స్ తాగాలనేది పందెం. దానికి సరేనన్న కాంథీ.. 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ తాగేశాడు. ఇక మూడో బాటిల్ తాగబోయే టైంలోనే అతనికి ఆల్కహాల్ పాయిజనింగ్ అయిపోయింది.
ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే.. తక్కువ టైంలో ఎక్కువ ఆల్కహాల్ తాగేస్తే, మానవ శరీరం తట్టుకోలేదు. శరీరంలో ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాల్సిన గుండె, ఊపిరితిత్తులు కూడా పనిచేయడం ఆగిపోతాయి. అలాంటి టైంలో కోమాలోకి వెళ్లడమో, చనిపోవడమో జరుగుతుంది. కాంథీకి అదే జరిగింది. అతను అలా కిందపడి చనిపోతుంటే.. అక్కడ తాగుతూ పార్టీ చేసుకుంటున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ ఇంకా తాగాలని అతన్ని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు.
ఎంత సేపటికీ కాంథీ లేవకపోవడంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చెక్ చేసి అప్పటికే కాంథీ చనిపోయాడని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పార్టీలో కాంథీకి ఛాలెంజ్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెక్లెస్ ప్రవర్తనతో ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడని అతనిపై కేసు పెట్టారు. అతను తన తప్పు కూడా ఒప్పుకున్నాడు. థాయ్ చట్టాల ప్రకారం అతనికి పదేళ్ల జైలుతోపాటు 50 వేల రూపాయల ఫైన్ కూడా పడే అవకాశం ఉంది.
ఇలాంటి టైంలో కాంథీ గతంలో చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తను ఇలాంటి రెక్లెస్ ఛాలెంజ్‌లు ఎందుకు తీసుకుంటానని కాంథీ చెప్పాడు. ఇలా చేస్తేనే డబ్బున్న వాళ్ల దగ్గర నుంచి తనకు కొంత డబ్బు దక్కుతుందని, దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అతను చెప్పాడు. కుటుంబం కోసం ఇలాంటి ఎన్ని రిస్కులైనా తీసుకుంటానని ఆ వీడియోలో అన్నాడు కాంథీ. ఇలాంటి పనులు చేసినందుకు తనను ట్రోల్ చేసినా, తిట్టినా పట్టించుకోనన్నాడు. ఆ వీడియో చూసిన చాలామంది కాంథీ మరణంపై సానుభూతి చూపిస్తున్నారు.