War 2: మామూలుగా ఒక భాషలో స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోహీరోయిన్లు ఇతర భాషల్లో అదే రేంజ్‌లో సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదు. వారి డబ్బింగ్ సినిమాలు ఇతర భాషల్లో మంచి విజయాన్ని సాధించినా కూడా ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలంటే మాత్రం వారు తప్పకుండా ఆలోచనలో పడతారు. ఎందుకంటే సౌత్ నుండి ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా ఎదురుదెబ్బ తిని వెనుదిరిగారు. అయినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇంకా బీ టౌన్‌లో ప్రయోగాలు చేయడానికి వెనకాడడం లేదు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఎన్‌టీఆర్ కూడా ఉన్నాడు. త్వరలోనే తను నటించిన ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాత్ర ఏంటంటే.?
రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ కేవలం తెలుగులోనే కాదు.. విడుదలయిన అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. అలా ఎన్‌టీఆర్‌ను పాన్ ఇండియా స్టార్ చేసింది. అందుకే తనను వెతుక్కుంటూ ఎన్నో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటన్నింటిని పక్కన పెట్టి ‘వార్ 2’ (War 2) లాంటి మల్టీ స్టారర్ చేయడానికి ఎన్‌టీఆర్ ఒప్పుకున్నాడు. సోలో హీరోగా కాకుండా అసలు ఒక మల్టీ స్టారర్‌తో బాలీవుడ్ డెబ్యూ చేయడానికి ఎన్‌టీఆర్ ఎలా ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కానీ ఈ పాత్ర గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది.
ఊహించని ఫ్లాష్‌బ్యాక్
ముందుగా ‘వార్’లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరో కాబట్టి సీక్వెల్‌లో కూడా తనే హీరో అయ్యింటాడని, ఎన్‌టీఆర్ విలన్ మాత్రమే అని వార్తలు వినిపించాయి. కానీ ఒక విలన్ పాత్రతో ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడతాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వారి అనుమానాలే నిజమయ్యాయి. ‘వార్ 2’లో ఎన్‌టీఆర్ (NTR) కేవలం విలన్ మాత్రమే కాదు. తన పాత్రకు అందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయనే విషయం బయటపడింది. ముందుగా తను సినిమాలో విలన్‌గా కనిపించినా అసలు తను అలా ఎందుకు అయ్యాడో చెప్పడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేశారట. ఇంటర్వెల్‌లో ఎన్‌టీఆర్ క్యారెక్టర్ గురించి అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవ్వనుందని సమాచారం.
Also Read: బాలయ్య పాటకు నెగిటివ్ రెస్పాన్స్.. అసలు ఏంటిది మాస్టారు.?
ఏంటో ప్లాన్.?
‘వార్ 2’లో ఎన్‌టీఆర్ డబుల్ రోల్‌లో కనిపించే అవకాశం కూడా ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ పక్కా అని తెలుస్తోంది. అంతే కాకుండా హృతిక్ రోషన్ కంటే తనకే ప్రాముఖ్యత ఉంటుందని కూడా రూమర్స్ బయటికొచ్చాయి. కానీ ఇదొక బాలీవుడ్ సినిమా, పైగా అతిపెద్ద బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఒక తెలుగు హీరోకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కష్టమే అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడే మంచి పొజిషన్‌లో ఉంది. కాబట్టి ఎన్‌టీఆర్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం బాలీవుడ్ మార్కెట్‌లో కూడా పనికొస్తుందని మేకర్స్ భావించే అవాకశం ఉంది.