Starbucks Job| ప్రముఖ కాఫీ కంపెనీ స్టార్‌బక్స్.. కాఫీలు, లాటెలకు దూరంగా ఒక కొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ఉద్యోగం పొందేవారికి ఏడాదికి రూ.3.08 కోట్ల (360,000 డాలర్లు) వేతనం. అయితే ఈ ఉద్యోగం చేసేవారికి విమానం నడపడంలో విస్తృత అనుభవం అవసరం. స్టార్‌బక్స్ తమ కంపెనీ విమానాన్ని నడిపేందుకు ఒక పైలట్‌ను నియమించుకోనుంది. ఈ పైలట్ దేశంలోనూ, విదేశాల్లోనూ స్టార్‌బక్స్ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
స్టార్‌బక్స్ తమ వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలను పేర్కొంది. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వ్యక్తి, కంపెనీ విమానం, దాని సిబ్బంది నిర్వహణ, విమాన ప్రయాణానికి ముందు ప్రణాళికను సిద్ధం చేయాలి. దీంతో పాటు అత్యంత సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించాలి.
సీఈవోతో పాటు ప్రయాణం
ఈ ఉద్యోగంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఎంపికైన పైలట్ స్టార్‌బక్స్‌లోని ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పనిచేయాలి. అందుకే అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలతో పాటు ప్రొఫెషనల్ బిహేవియర్ కలిగి ఉండడం చాలా అవసరం. స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ ఈ విమానంలో తరచూ ప్రయాణిస్తూ ఉంటారు. ఆయన కాలిఫోర్నియాలోని తన ఇంటి నుండి సీటెల్ నగరానికి స్టార్‌బక్స్ ప్రధాన కార్యాలయానికి వారంలో ఎక్కువ రోజులు 1,000 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ ఉద్యోగంలో భాగంగా ప్రయాణికులకు లగేజ్ కు సంబంధించిన సాయం కూడా చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ అర్హతలు
ఈ ఉద్యోగానికి పూర్తిస్థాయిలో విమానం నడిపే నైపుణ్యం అవసరం. దరఖాస్తుదారుడికి కార్పొరేట్ ఫ్లైట్ విభాగంలో కెప్టెన్‌గా 5 సంవత్సరాల అనుభవం, మొత్తం 5,000 గంటల విమాన నడపడం అనుభవం ఉండాలి. అలాగే, ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ సర్టిఫికేట్, ఫస్ట్-క్లాస్ మెడికల్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఎఫ్‌సిసి (FCC) రిస్ట్రిక్టెడ్ రేడియో ఆపరేటర్ పర్మిట్ తప్పనిసరి.
Also Read: 10 లక్షల ఉద్యోగాలు.. 2026 నాటికి ఏఐ రంగంలో దేశవ్యాప్తంగా భారీ డిమాండ్
స్టార్‌బక్స్ బారిస్టా ఉద్యోగుల కంటే ఈ స్టార్ బక్స్ పైలట్ ప్రతినిధి జీతం 10 రెట్లు ఎక్కువ. దరఖాస్తుదారులు స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ ఇమేజ్‌ను సానుకూలంగా ప్రతిబింబించేలా, సభ్యత, గౌరవపూర్వక ప్రవర్తన కలిగి ఉండాలి.
స్టార్‌బక్స్ కెప్టెన్-పైలట్-ఇన్-కమాండ్‌గా ఉద్యోగం చేసేవారు.. ప్రయాణికుల పట్ల కంపెనీ ప్రతినిధి ఉత్తమ సేవ కనబర్చాలని ఉద్యోగ వివరణలో పేర్కొనబడింది. ఈ ఉద్యోగం స్టార్‌బక్స్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధించే అవకాశాన్ని అందిస్తుంది. అయితే, దీనికి అధిక నైపుణ్యం, బాధ్యత, ప్రొఫెషనలిజం అవసరం. ఈ పాత్రలో ఎంపికైన వ్యక్తి స్టార్‌బక్స్ కంపెనీ ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వహిస్తూ, కంపెనీ ప్రతిష్ఠను కాపాడే బాధ్యతను కూడా వహించాలి.