Starbucks HotDrink Burns| అమెరికాలో ఓ విచిత్ర కేసులో నాలుగేళ్ల సుదీర్ఘ కాలం విచారణ సాగింది. ఈ కేసులో ఒక కాఫీ కంపెనీ వల్ల ఒక కస్టమర్ తీవ్రంగా నష్టపోయాడని.. అందుకు బాధ్యత వహిస్తూ.. కంపెనీ రూ.415 కోట్లు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందని ఒక ప్రముఖ కాఫీ కంపెనీ అయిన స్టార్ బక్స్ కు ప్రపంచవ్యాప్తంగా కెఫెలు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో స్టార్ బక్స్ కెఫె నుంచి గార్షియా అనే ఒక డెలివరీ డ్రైవర్ 2020లో కాఫీ పార్సిల్ తీసుకున్నాడు. అమెరికాలో పార్సిల్ సర్వీస్ కోసం డ్రైవ్ త్రూ నిర్మాణాలుంటాయి. అంటే కారులో వచ్చి రెస్టారెంట్ లో ఒక ప్రత్యేక నిర్మాణం వైపునకు వెళితే.. అక్కడ కెఫె సిబ్బంది వారికి కావాల్సిన ఆర్డర్ తీసుకొని అక్కడి నుంచే పార్సిల్ చేసి ఇస్తారు. ఈ ప్రక్రియలో కస్టమర్ కారు దిగవలసిన అవసరం ఉండదు. కెఫె సిబ్బంది కూడా ఒక కిటికీ లాంటి కౌంటర్ ద్వారా ఆర్డర్ అందించేస్తారు.
ఈ క్రమంలో 2020 సంవత్సరంలో ఒక డెలివరీ వ్యాన్ నడుపుతున్నగార్షియా అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని స్టార్ బక్స్ కాఫీ షాపు డ్రైవ్ త్రూకి వెళ్లి.. అక్కడ పెద్ద సైజు (వెంటీ సైజు) కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. పాశ్చాత్య దేశాలు.. ప్రస్తుతం ఇండియాలోని నగరాల్లో కూడా కాఫీ, ఇతర ద్రవ పదార్థాలు యూజ్ అండ్ త్రో గ్లాసుల్లో పార్సిల్ ఇస్తారు. అయితే వాటికి గట్టిగా మూత బిగించి ఇస్తారు. ఈ సౌకర్యం ఉండడంతో కారు నడిపే వ్యక్తి ఆ డ్రింక్ ని కారులో పెట్టుకొని సిప్ చేసుకుంటూ తాగొచ్చు. అయితే ఆ డెలివరీ వ్యాన్ డ్రైవర్ స్టార్ బక్స్ నుంచి తీసుకున్న కాఫీ గ్లాసుకు సరిగా మూత పెట్టలేదు. పైగా అక్కడి కాఫీ బాగా వేడిగా ఉంటుంది. దీంతో డ్రైవర్ తన వాహనాన్ని కొంత దూరం నడిపాక ఆ గ్లాసులో నుంచి కాఫీ ఒలికి అతడి ఒడిలో పడింది. కాఫీ బాగా వేడిగా ఉండడంతో అతని తొడలు, ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఉన్న చర్మం అంతా కాలిపోయింది. దీంతో గార్షియా ఆస్పత్రి పాలయ్యాడు. అతనికి గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు.
Also Read: ఇదెక్కడి మోసం మామా.. 22 ఫేక్ ఎంప్లాయిస్ తో రూ.18 కోట్లు కొట్టేసిన హెచ్‌ఆర్!
దీంతో అతను మూడు నెలల పాటు ఆస్పత్రిలో పలు చర్మ సంబంధిత ఆపరేషన్లు (గ్రాఫ్టింగ్), చికిత్స తీసుకున్నాడు. ఈ కారణంగా అతను ఉద్యోగం కోల్పోయాడు. అతను ఆస్పత్రిలో అనుభవించిన వేదన, మాససిక క్షోభకు పరిహారం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే అతని లాయర్ కోర్టులో వాదిస్తూ స్టార్ బక్స్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే తన క్లైంటు తీవ్రంగా నష్టపోయాడని.. అతనికి సంతాన కూడా కలిగే అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాడు.
నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన కేసులో ఇరు వైపులా వాదనలు విన్న లాస్ ఏంజెలిస్ కోర్టు జ్యూరీ సభ్యులు కంపెనీదే తప్పిదంగా తేల్చారు. దీంతో కోర్టులో న్యాయమూర్తి బాధితుడు గార్షియాకు స్టార్ బక్స్ కంపెనీ 50 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.415 కోట్లు) చెల్లించాలని తీర్పు చెప్పింది. కానీ కంపెనీ మాత్రం కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. నష్టపరిహారం మరీ ఎక్కువగా ఉందని చెప్పారు. అందుకోసం పై కోర్టులో అప్పీల్ చేస్తామని స్టార్ బక్స్ కంపెనీ లాయర్ వెల్లడించారు.
ఇలాంటిదే ఒక కేసు 1994లో మెక్ డొనాల్డ్స్ కంపెనీకి వ్యతిరేకంగా కూడా వచ్చింది. ఆ కేసులో 78 ఏళ్ల స్టెల్లా లైబెక్ అనే వృద్ధరాలు ఇలాగే తన మనవడితో కారులో వెళ్లగా.. మెక్ డొనాల్డ్స్ కూడా కాఫీ ఆర్డర్ చేశారు. అక్కడ మెక్ డొనాల్డ్స్ సిబ్బంది ఆమెకు వేడి వేడిగా ఉన్న కాఫీని మూత లేకుండా ట్రేలో పెట్టి ఇచ్చారు. ఆ ట్రేని తీసుకున్న స్టేలా దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక కాఫీ మొత్తం తన మీద వేసుకున్నారు. ఈ ఘటనలో ఆమె శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, పొత్తి కడుపు భాగం కాలిపోవడంతో ఆస్పత్రిలో గ్రాఫ్టింగ్ ఆపరేషన్లు చేయాలసి వచ్చింది. దీంతో ఆమె కోర్టులో మెక్ డొనాల్డ్స్ సంస్థ పై నిర్లక్ష్యం కేసు వేసింది. కోర్టు ఆమె వాదనలు విన్న తరువాత కంపెనీ సిబ్బంది కాఫీకి మూత ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించింది. దానికి సరైన సమాధానం లేకపోవడంతో మెక్ డొనాల్డ్స్ కంపెనీ 3 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే పై కోర్టులో అప్పీల్ చేయగా.. ఆ మొత్తం 4,80,000 డాలర్లకు తగ్గింది.