హాస్పిటల్ అనగానే ఓ ఆనాసక్తికర భావన మనలో కలుగుతుంది. రకరకాల సమస్యలతో వచ్చే పేషెంట్లను చూస్తూ అక్కడ ఉండాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్ప, హాస్పిటల్ వైపు కూడా చూడరు చాలా మంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాస్పిటల్ చాలా డిఫరెంట్. ఇక్కడ అడుగు పెడితే అద్భుతంగా ఉంటుంది. అస్సలు బయటకు రావాలి అనిపించదు. హాస్పిటల్ పరిసరాలన్నీ అద్భుతమైన శిల్పాలతో అలరిస్తాయి. తాము వెళ్లింది హాస్పిటల్ కా? లేదంటే ఏదైనా సైన్స్ మ్యూజియానికా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ ఆ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే?
ఆకట్టుకునే గర్భస్థ శిశువు శిల్పాలు
దోహా కతర్ లోని సిద్రా మెడిసిన్ అనేది ప్రముఖ హాస్పిటల్. ఇది మహిళలు, పిల్లలకు సంబంధించిన ఆసుపత్రి. వైద్య విద్యను అందించడంతో పాటు బయోమెడికల్ పరిశోధన కేంద్రంగా పని చేస్తుంది. ఇది కతర్ ఫౌండేషన్ లో భాగంగా ఉంది. ఎడ్యుకేషన్ సిటీలో ఉంది. 400 బెడ్స్ తో మొదలైన ఈ హాస్పిటల్ లో.. 580 పడకల వరకు విస్తరించే సౌకర్యం ఉంది. ఈ హాస్పిట్ 2016లో ప్రారంభమైంది. ఈ హాస్పిటల్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానికి కారణం ఈ హాస్పిటల్ ప్రాంగంణం లోని ఆకర్షణీయమైన శిల్పాలు. ‘ది మిరాకులస్ జర్నీ’ పేరుతో ప్రసిద్ధ బ్రిటిష్ ఆర్టిస్ట్ డామియన్ హర్స్ట్ ఈ శిల్పాలను రూపొందించారు. ఈ శిల్పాలు హాస్పిటల్ ప్రాంగణంలో అలంకరించబడి ఉన్నాయి. ఇవి గర్భావస్థలో శిశువు అభివృద్ధి ప్రయాణాన్ని అద్భుతంగా చూచిస్తున్నాయి.
ది మిరాకులస్ జర్నీ అంటే ఏంటి?
తల్లి గర్భంలో శిశువు పెరిగే విధానాన్ని ది మిరాకులస్ జర్నీగా పిలుస్తున్నారు. ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 14 భారీ బ్రాంజ్ శిల్పాలు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇవి గర్భంలో శిశువు అభివృద్ధి, వివిధ దశలను సూచిస్తున్నాయి. ఈ శిల్పాలు గర్భావస్థలో శిశువు 26 వారాల నుంచి పూర్తి అభివృద్ధి చెందిన శిశువు వరకు రకరకాల ఆకారాలను ప్రెజెంట్ చేస్తున్నాయి. ఈ శిల్పాల ఎత్తు 7 నుంచి 11 మీటర్ల వరకు ఉన్నాయి. ఇవి హాస్పిటల్ ఆవరణలోని గార్డెన్ లో ఎదురుగా ఏర్పాటు చేశారు.
ఈ శిల్పాలు మెడికల్ ఇమేజింగ్ (MRI, అల్ట్రాసౌండ్) ఆధారంగా రూపొందించారు. ఇవి శాస్త్రీయ కచ్చితత్వం, కళాత్మక భావనలను కలిపి ఉన్నాయి. హాస్పిటల్ ఎంట్రెన్స్ నుంచి ప్రధాన భవనం వైపు ఒక లైనర్ లో అమర్చారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇతర చిన్న శిల్పాలు, నీటి ఆకృతులు కూడా ఉన్నాయి. ఇవి శాంతి, సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. హాస్పిటల్ కు వచ్చే పేషెంట్స్ బంధువులు బయటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా గడిపేలా హాస్పిటల్ ప్రాంగణాన్ని రూపొందించారు. దోహాలోని మరే ఇతర హాస్పిటల్స్ లోనూ ఇలాంటి వాతావరణం ఉండదంటున్నారు ఈ హాస్పిటల్ సిబ్బంది. ప్రజలు మనిషి పుట్టుక, ఎదుగుదల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శిల్పాలను ఏర్పాటు చేయించినట్లు వెల్లడించారు.
Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?