Big Tv Live Originals: చరిత్రలో ఎన్నో వింత ఘటనలు ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాయి. అలాంటి వాటిలో ఒకటి వాషింగ్టన్ డీసీ మెట్రోలో ప్రమాద ఘటన. ఇక్కడ రైలు ప్రమాదం ఆశ్చర్యం కలిగించలేదు. ఆ ప్రమాదంలో చనిపోయిన మెట్రో రైలు లోకో పైలెట్ సెల్ ఫోన్ నుంచి పదే పదే కుటుంబ సభ్యులకు కాల్స్ వెళ్లడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా పాకెట్ లో ఉన్న ఫోన్ నుంచి కాల్స్ ఎలా వెళ్లాయి? అనేది ఓ మిస్టరీ గా మిగిలిపోయింది. దానికి లాజికల్ కంక్లూజన్ ఇప్పటికీ ఎవరూ ఇవ్వలేకపోయారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
2009 జూన్ 22 నాడు వాషింగ్టన్ డీసీ మెట్రో చరిత్రలోనే ఘోర ప్రమాదం జరిగింది. రెడ్ లైన్ రైళ్లు ఒకదానితో మరొకటి తగిలాయి. ఫోర్ట్ టోటెన్ స్టేషన్ సమీపంలో సాయంత్రం రద్దీ సమయంలో ఒక రైలు మరొక రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రైలు లోకో పైలెట్ జీనిస్ మెక్ మిలన్ కూడా చనిపోయింది. శిథిలాల్లో చిక్కుకుపోయింది. రెస్క్యూ సిబ్బంది ఆమె మృతదేహాన్ని కష్టపడి బయటకు తీశారు.
మిలన్ ఫోన్ నుంచి మిస్టీరియస్ కాల్స్
రైలు ప్రమాదం తర్వాత కొన్ని గంటలకు మెక్ మిలన్ ఫోన్ నుంచి ఆమె కుమారుడు ఆంథోనీ, సోదరి ట్రేసీ పలు కాల్స్ వచ్చాయి. చనిపోయిన మెలన్ ఫోన్ నుంచి కాల్ రావడంతో షాకయ్యారు. వారు ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారి అక్కడి నుంచి ఏమైనా సమాధానం వస్తుందేమోనని ఆశగా ఎదరు చూశారు. కానీ, ప్రతిసారి మౌనమే సమాధానం అయ్యింది. గంటల తరబడి ఆమె ఫోన్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. క్రాష్ సైట్ లో సహాయక సిబ్బంది ఆమె ఫోన్ ను కనిపెట్టారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు కాల్స్ వెళ్లినట్లు మెట్రో అధికారులు ధృవీకరించారు. అయితే, ప్రమాదం తర్వాత ఫోన్ నంబర్లను ఎలా డయల్ చేసి ఉండవచ్చు? కాల్ లిఫ్ట్ చేసిన వారికి ఎలాంటి శబ్దం ఎందుకు వినిపించలేదు? అనేది ఏ టెక్ నిపుణుడు కూడా చెప్పలేకపోయాడు. పోనీ, ఆ ఫోన్ నుంచి మరెవరైనా కాల్స్ చేశారా? అంటే అలా చేసే అవకాశమే లేదని, క్రాష్ సైట్ లో శిథిలాల కింద ఆఫోన్ ఉన్నట్లు వెల్లడించారు అధికారులు. అంతేకాదు, ఆ ఫోన్ ట్యాంపరింగ్ కు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు.
సమాధానం కోసం ప్రయత్నించినా…
ఈ ఫోన్ కాల్స్ ఎలా వెళ్లాయి అనే విషయానికి సంబంధించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. బహుశా ఫోన్, ప్రమాదంలో దెబ్బతిని, విద్యుత్ ప్రసారం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని వెల్లడించారు. మరికొందరు ఫోన్ డ్యామేజ్ అయిన సమయంలో ముఖ్యమైన వ్యక్తులకు కాల్స్ వెళ్లేలా తను సెట్ చేసి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. కానీ, ఏ సమాధానాలు సరైన కంక్లూజన్ ఇవ్వలేకపోయాయి. రైలు ప్రమాదం జరిగి సుమారు 16 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ ఫోన్ కాల్స్ మిస్టరీ మాత్రం బయటపడలేదు. అదో అంతులేని రహస్యంగానే కొనసాగుతుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: బీచ్ లో ఎప్పుడైనా కెరటాలు ఇలా కనిపిస్తే.. అస్సలు దిగొద్దు.. ఎందుకంటే?