తైవాన్ లో పెద్దల చితా భస్మాన్ని కుటుంబ సభ్యులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెద్దల జ్ఞాపకాలను దానిలోనే చూసుకుంటూ గడిపేస్తారు. అలాంటి చితా భస్మాన్ని దొంగిలించిన తన మాజీ ప్రియురాలిని బెదిరించే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి, దొంగిలించిన చితా భస్మాన్ని సదరు మహిళ దగ్గరికి చేర్చడంతో పాటు సదరు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన తైవాన్ లో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
57 ఏళ్ల ఎల్వీ అనే వ్యక్తి కోళ్లను పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన 48 ఏళ్ల టాంగ్ అనే మహిళతో గతంలో కలిసి ఉన్నాడు. సుమారు 15 ఏండ్ల పాటు ఇద్దరూ కలిసి జీవించారు. ఎల్వీ అప్పులు చేయడం, తాగుడుకు బానిస కావడంతో 2023లో టాంగ్ అతడితో విడిపోయింది. ఆమె దూరమైన తర్వాత అతడి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆమె లేకపోతే తన జీవితం మరింత ఆగం అవుతుందని భావించాడు. మళ్లీ తనతో కలిసి ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె అంగీకరించలేదు. అతడి చెడు అలవాట్ల కారణంగా దూరం పెట్టింది. చివరకు తనతో కలిసి ఉండకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. అయినా, ఆమె పట్టించుకోలేదు.
తండ్రి చితా భస్మాన్ని దొంగిలించిన ఎల్వీ
తనను కాదన్న టాంగ్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎల్వీ భావించాడు. అందులో భాగంగానే టాంగ్ తండ్రి చితా భస్మాన్ని ఉంచిన సమాధిని ధ్వంసం చేయాలనుకున్నాడు. తైవాన్ లో ఎవరైనా చనిపోతే వారిని దహనం చేసి, చితాభస్మాన్ని ఓ పాత్రలో ఉంచి దాన్ని పాతేసి, సమాధి నిర్మిస్తారు. అలాగే టాంగ్ తండ్రి చనిపోవడంతో ఆయనకు సమాధి నిర్మించారు. ఎలాగైనా ఆ సమాధిని ధ్వంసం చేసి, ఆమెను మానసిక క్షోభకు గురి చేయాలనుకున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో సమాధిని ధ్వంసం చేసి చితాభస్మం పాత్రను దొంగతనం చేశాడు. ప్రేమికుల రోజున ఎల్వీ.. టాంగ్ కు ఓ బెదిరింపు లేఖ పంపించాడు. ఆ లేఖతో పాటు దొంగించిన చితాభస్మం ఫోటోను ఉంచాడు. తిరిగి తన దగ్గరికి రాకపోతే, మీ తండ్రిని మళ్లీ చూడలేవంటూ హెచ్చరించాడు.
పోలీసులను ఆశ్రయించిన టాంగ్
ఎల్వీ చేసిన పనికి టాంగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు స్మశాన వాటికను తనిఖీ చేశారు. చితాభస్మం ఉంచిన కంపార్ట్ మెంట్ ధ్వంసం చేయడాన్ని గమనించారు. చితాభస్మం పాత్ర, ఫలకం రెండూ లేవని గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఆ పాత్ర కోళ్ల ఫారమ్ సమీపంలో దాచి పెట్టారని గుర్తించారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని టాంగ్ కు అప్పగించారు. అటు ఇప్పటికే మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఎల్వీ జైలులో ఉన్నాడు. విచారణ సమయంలో ఆయన ఆ పని చేశాడు. ఇప్పుడు ఆయన అంత్యక్రియల వస్తువులను దొంగిలించడం, ఎదుటి వారి సెంటిమెంట్ ను దెబ్బతీయడం, బెదిరింపులకు పాల్పడ్డం లాంటి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
Read Also: మరదలు వల్ల ‘చెప్పు’ దెబ్బలు తిన్న పెళ్ళి కొడుకు.. ఏం జరిగిందంటే..?