ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు క్రేజీ ఆఫర్లు ఇచ్చి వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా థాయ్ లాండ్ లోని ఓ రెస్టారెంట్ కూడా సరికొత్త డిస్కౌంట్ ఆఫర్ ను పరిచయం చేసింది. రెస్టారెంట్ ఎంట్రీ గేట్ దగ్గర ఐదు రకాల కొలతలతో మెటల్ బార్లను ఏర్పాటు చేసింది. ఎంత సన్నటి సందులో నుంచి లోపలికి అడుగు పెడితే, అంత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అయితే, ఈ క్రేజీ ఆఫర్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కువ బరువు ఉన్న వాళ్లను అవమానించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
థాయ్ లాండ్ లోని చియాంగ్ మై బ్రేక్ ఫాస్ట్ వరల్డ్ ‘స్కిన్నీ డిస్కౌంట్’ పేరుతో ఓ క్రేజీ ఆఫర్ ను పరిచయం చేసింది. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన ఆఫర్ వీడియోను ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్లు అమీనా, అలెక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. సుమారు 8 మిలియన్ల వ్యూస్ సాధించింది. అదే సమయంలో తీవ్ర చర్చకు కారణం అయ్యింది.
ఈ రెస్టారెంట్ ఎంట్రీ పాయింట్ దగ్గర కలర్ కోడెడ్ మెటల్ బార్ లను ఏర్పాటు చేశారు. ఒక్కో బార్ ఒక్కో డిస్కౌంట్ కు అనుగుణంగా ఉంటుంది. ఎంత సన్నని బార్ లో నుంచి వెళ్తే అంత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. సన్నని దారిగుండా వెళ్తే రెస్టారెంట్ లో కొనుగోలు చేసిన ఐటమ్స్ పై 20% డిస్కౌంట్ అందిస్తారు. కొంచెం వెడల్పుగా ఉన్న స్లాట్ లో నుంచి వెళ్తే 15%, మరికొంచెం వెడల్పు ఉంటే 10% ఇంకాస్త వెడల్పు ఉంటే 5% డిస్కౌంట్ అందిస్తారు. ఎక్కువ లావు ఉన్న వారికి ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక అమీనా, అలెక్స్ షేర్ చేసిన వీడియోలో ఒక యువతి 15% డిస్కౌంట్ పొందే బార్ లో నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. మరొక వీడియోలో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి 10% బార్ ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయాడు. చివరికి 5% బార్ లో నుంచి వెళ్లాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘స్లిన్నీ బాడీ, స్కిన్నీ బిల్’ కొందరు ప్రశంసించగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇది లావుగా ఉన్న వారిని అవమానించేలా ఉందని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. “రెస్టారెంట్ ఆఫర్ బాగుంది. ప్రజలు చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలని సూచిస్తోంది. ఇందులో ఏమాత్రం తప్పులేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇలాంటి ఆఫర్లు అన్ని దేశాల్లో రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే బరువు మీద ప్రజల్లో అవగాహన కలుగుతుంది” మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇది గొప్ప ఆలోచన, బహుశా నాకు డిస్కౌంట్ లభించకపోవచ్చు. కానీ, ఆరోగ్యం కోసం తక్కువ తినాలని నాకు గుర్తు చేస్తుంది” అని అభిప్రాయపడ్డాడు.
Read Also: కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!