AP Politics: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైలెంట్ గా ఉండటం వెనకాల పెద్ద కారణమే ఉందా..? క్యాడర్ వద్దంటున్నా టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఎక్కడా కూడా పార్టీ కార్యకలాపాల్లో ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి కనపడటం లేదు. అసలు ఇంత వరకు ఏలూరు టీడీపీ కార్యాలయం గుమ్మం తొక్కిన దాఖలాలే కనిపించడం లేదు. అంటే స్థానిక నాయకులతో ఆళ్ల నానికి ఇంకా సయోధ్య కుదరలేదా? లేక పార్టీ ప్రోటోకాల్ పదవి దక్కిన తర్వాతే ప్రజల్లోకి వస్తారా.? . ఇటీవల పార్టీ మారిన ఆయన కొత్త పార్టీలో ఉండలేక మళ్ళీ సొంత పార్టీకి వెళ్లిపోవటానికి రూట్ క్లియర్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారా ? అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారా?
వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని
వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని.. జిల్లా రాజకీయాలను తను కనుసన్నులతో నడిపిన సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి అనుంగ అనుచరుడిగా, వీర విధేయుడుగా చెప్పుకునేవారు.. అయితే 2024 ఎన్నికల్లో ఏలూరులో తనతో పాటు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో సొంత పార్టీని వీడి సైకిల్ ఎక్కేశారు.. సైకిల్ ఎక్కినప్పటికీ ఆ సైకిల్ పై ఎక్కడా తిరగడం లేదు . ఏలూరు జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కొద్ది నెలల క్రితం పార్టీకి, పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు..
టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి
టీడీపీలో చేరిన నాటి నుండి ఆళ్ల నాని ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భం కూడా లేదు.. దాంతో అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయంట. అయితే జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమైన ప్రోటోకాల్ పదవితోనే పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆళ్ల నాని ఉవ్విళ్ళూరుతున్నట్లు తెలుస్తుంది.. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఏలూరు తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియడంతో వాళ్లంతా ఆళ్ల నాని రాకను వ్యతిరేకించారు. అయితే పార్టీ అధిష్టానం నేతలకు కార్యకర్తలకు సర్ది చెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చిందంట. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆళ్ల నాని స్వయంగా వెళ్లి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా మెడలో వేయించుకున్నారు. తనతో పాటు కుమారుడ్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చి అందరిని ఆశ్చర్యపరిచారు..
కుమారుడ్ని అరంగేట్రం చేయించేందుకు నాని ప్రయత్నాలు
ఇకపై ఆళ్ళ నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి తన కుమారుడితో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీలో చేరి నెలలు గడుస్తున్నా ఎక్కడా కూడా ఆళ్ల నాని గాని ఆయన కుమారుడు గాని పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి పూర్తిగా దూరంగా ఉన్న ఆళ్ళ నాని గతంలో ఏలూరు నగరంలో ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిలా వ్యవహరించారు. పార్టీ నాయకులను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తన వారినే నియమించుకున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 కార్పొరేటర్ సీట్లలో 47 సీట్లు వైసీపీ గెలుచుకునేలా చక్రం తిప్పి పార్టీకి తిరుగు లేదని నిరూపించారు.
నానితో పాటు మిగిలిన కార్పొరేటర్లు సైతం టీడీపీలో చేరతారని ప్రచారం
అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఏలూరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఆళ్ల నాని కంటే ముందుగానే వారు టీడీపీలో చేరినప్పటికీ, మిగిలిన మరికొంతమంది వైసిపి కార్పొరేటర్లు కూడా ఆళ్ల నాని చేరిక తర్వాత త్వరలో టీడీపీలో చేరబోతున్నారని, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో వాళ్లు కూడా చురుకుగా పాల్గొననున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు అటువంటిదేమీ జరగకపోవడం ఆళ్ల నాని వర్గీయుల్నే ఆశ్చర్యపరుస్తోందంట. సుదీర్ఘ కాలం పాటు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయటం అప్పట్లోనే అందర్నీ షాక్‌కు గురిచేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేశారని అందరూ అనుకున్నా సీఎం చంద్రబాబు సమక్షంలో తన కుమారుడితో కలిసి ఆళ్ల నాని పసుపు కండువా వేయించుకోవటం వైసిపి వర్గాలను మరింత కలవరపరిచింది.
Also Read: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?
అప్పటినుండి ఆళ్ల నాని అంటేనే వైసీపీ వర్గం మండిపడుతోంది. ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నానికి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా నానిని సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ వస్తే ఈ విధంగా మోసం చేసి వెళ్లిపోతారా అంటూ ఏలూరు వైసీపీ క్యాడర్ మండిపడుతూనే ఉంది. అదలా ఉంటే అళ్ల నానిని నమ్ముకున్న ఒక వర్గీయులు మాత్రం ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. 1999 ఎన్నికల నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చి ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంత సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పదవులు ఉంటేనే ప్రజల్లో ఉంటాను, లేకపోతే అసలు కనపడను అన్నట్లుగా కనీసం అందుబాటులో లేకపోవడం ఆళ్ల నాని వర్గాన్ని గందరగోళానికి గురిచేస్తోందంట.
బడేటి కోట రామారావు చేతిలో ఓటమి పాలైన ఆళ్ల నాని
2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బడేటి కోట రామారావు అలియాస్ బుజ్జి చేతిలో ఓడిపోయిన తర్వాత రెండేళ్ల పాటు ఏలూరులో ఆళ్ల నాని ఎవరికి దర్శనం కూడా ఇవ్వలేదు. వైసిపి అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వడంతో అప్పుడు ఆయన ప్రజల్లో తిరగటం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ 2024లో ఓటమి అనంతరం ఆళ్ల నాని నియోజకవర్గంలో కనపడటం మానేశారు. ఏ నాయకుడైనా తన వర్గాన్ని కాపాడుకోవడానికి ఎంతదాకైనా వెళ్తాడు. తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తాడు. కానీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని రూటే సపరేటు. పదవి లేకపోతే కనీసం ఆళ్ల నాని ఇంటి వద్ద పలకరించే వారు కూడా ఉండరంటున్నారు వాళ్ళ నాని వర్గీయులు.
2029లో కుమారుడ్ని ఎన్ని్కల్లో పోటీ చేయించే ఆలోచన
అదలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2029 లో జరిగే ఎన్నికలకు ఆళ్ల నాని కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇవన్నీ ఒక ఎత్తయితే టిడిపిలోకి ఆళ్ల నాని రాకను వ్యతిరేకించిన నేతల వలనే ఆయన పార్టీ కార్యక్రమాల్లోకి రాలేకపోతున్నారంటూ నాని వర్గం నేతలు చెప్తున్నారు. మరో పక్క నాని మౌనం వెనుక మరల వైసీపీలో చేరే ఆలోచనలు లేకపోలేదు అంటున్నారు. గతంలో సైతం పోటీలో ఉండనంటూనే వేరే వారికి వైసిపి ఇన్చార్జి పదవి కట్టబెట్టి వాళ్లతో డబ్బులు ఖర్చు పెట్టించి, ఎన్నికలు వచ్చే సమయానికి తాను తప్ప ఇంకెవరు పోటీ చేయలేరని, పోటీ చేస్తే ఓడిపోతారంటూ అధిష్టానానికి సంకేతాలు పంపించిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు..
నానికి పదవి కట్టబెడితే రాజీనామాలకు సిద్దమవుతున్న టీడీపీ క్యాడర్
ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ నేతలని ముప్పతిప్పలు పెట్టిన ఆళ్ల నానికి పార్టీ పరంగా పదవి బాధ్యతలు అప్పచెప్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్నారు ఏలూరు టీడీపీ నేతలు.. టీడీపీ అధిష్టానం మాత్రం ఆళ్ల నాని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని కాపు సామాజికవర్గానికి చెందిన ఆళ్ల నానికి కీలక బాధ్యతలు అప్పజెప్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేయవచ్చనే ఆలోచనలో ఉందంటున్నారు. మరి చూడాలి మాజీ డిప్యూటీ సీఎం ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?
Story By Vamshi Krishna, Bigtv