Food Poisoning: ఉడకని ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీ దేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉడకని ఆహారం తిని అస్వస్థతకు గురికావడంతో..వారిని వెంటనే పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.
భోజన నాణ్యతపై విద్యార్థుల అసంతృప్తి
ఈ ఘటన ఒక్కసారిగా జరిగినదేమీ కాదు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం నాణ్యతపై.. అనేకమారు సమస్యలు చెబుతూ వచ్చారు. విద్యార్థుల సమాచారం ప్రకారం, అన్నంలో పురుగులు ఉండటం, అన్నం బాగా మెత్తగా లేకపోవడం, నీళ్లతో కలిపిన చారు వంటివి వడ్డించడం రెగ్యులర్ అయిపోయిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రుల్లో ఆందోళన, ఆగ్రహం
సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పాఠశాలకు చదువుకోడానికి వెళ్తున్నారు కానీ, పాడైన భోజనం తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధాకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై పర్యవేక్షణ లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి.. బాధ్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైద్యుల నిర్ధారణ
ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ దేవి నాగ్, పిల్లలకు అస్వస్థత కలిగిన కారణం పూర్తిగా ఉడకని అన్నం తినడమే అని నిర్ధారించారు. ఆహారం తినిన కొద్ది సమయం లోపలే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో తక్షణమే వైద్యం అందించామన్నారు. ఇప్పటికైతే విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నదని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం?
ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం స్థానిక అధికారులు, పాఠశాల యాజమాన్యంపై.. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పర్యవేక్షించాల్సిన పాఠశాల సిబ్బంది, అధికారుల బాధ్యతపై దృష్టి పడుతోంది. పాఠశాలలో భోజనాన్ని వండే వ్యక్తుల వద్ద సరైన శిక్షణ లేదా? అందించే పదార్థాల నాణ్యతను ఎవరూ పరిశీలించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తక్షణ చర్యలు అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలంటే.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, అన్ని పాఠశాలల్లో భోజన నాణ్యతపై మళ్లీ పర్యవేక్షణ ప్రారంభించాలి.
Also Read: ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే.. నిజమైన దేశభక్తులు: సీఎం చంద్రబాబు
పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన పథకాలు, ఇలా అమలులో నిర్లక్ష్యంతో ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం బాధాకరం. గౌరీదేవిపేట ఘటన సమాజానికి గుణపాఠంగా మారాలని, ప్రభుత్వ యంత్రాంగం దానికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.