Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతినబూనారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యమని ఐక్యకార్యచరణ సమితి నేత పువ్వాడ సుధాకర్ స్పష్టం చేశారు. 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు.. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్‌ను ఓడిస్తారని తేల్చిచెప్పారు.
అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహిళా రైతులు అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయంతో అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో అమరావతి రైతుల కష్టాలు తీరబోతున్నాయన్నారు.