Lady Aghori: అఘోరీ మాత కారుకు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. కానీ తన కారు యాక్సిడెంట్ ఘటన వెనుక ఉన్నది వారేనంటూ తాజాగా అఘోరీ మాత సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగక తన ప్రమాదానికి కారకులైన వారికి శాపం తగులుతుందని ఓ వీడియో కూడా విడుదల చేశారు అఘోరీ మాత.
అఘోరీ మాత అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. ప్రస్తుతం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏపీలోని అన్ని ఆలయాలను అఘోరీ మాత సందర్శిస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తికి వెళ్లిన అఘోరీ మాతను ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, పోలీసులు రంగ ప్రవేశం చేయడం, మాత ఆత్మార్పణకు సిద్ధం కావడం తెలిసిన విషయమే.
ఆ తర్వాత ఆత్మార్పణను నివారించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, వివాదం సద్దుమణిగేలా చర్చలు సాగించారు. చివరకు ఎర్రటి వస్త్రాలు ధరించి, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించి తాను అనుకున్నది సాధించారు. అది కూడా అఘోరీ మాతకు పోలీస్ ఎస్కార్ట్ మాదిరిగా తీసుకువచ్చి, దర్శనం చేయించారు పోలీసులు.
ఇక ఇక్కడే ఊహించని ప్రమాదం జరిగింది అఘోరీ మాత కారుకు. శ్రీకాళహస్తి నుండి విజయవాడ వెళ్లేందుకు కారులో అఘోరీ మాత వెళ్తుండగా, కొద్ది దూరంలోనే కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అఘోరీ మాతకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదానికి కారణం మాత్రం కారుకు లైట్లు వెలగకపోవడమేనని తెలుస్తోంది. కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న ఆమె స్వగ్రామం కుశ్నపల్లిలో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలిసి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులపై గుర్రుమన్న అఘోరీ మాత..
ఈ ప్రమాదం జరిగిన తరువాత ఏం జరిగిందోనన్న భయంతో పోలీసులు, స్థానిక ప్రజలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం అఘోరీ మాత ఓ వీడియోను విడుదల చేశారు. తన కారు ప్రమాదానికి గల కారణం పోలీసులేనంటూ ఆరోపించారు. తన కారుకు లైట్లు మరమ్మతులు చేయించుకోవాలని తెలిపినా కూడా, పోలీసులు వినిపించుకోలేదని అందుకే తన కారుకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కేవలం హైవే వరకు వచ్చి తనను వదిలివేసినట్లు, తనకు ఏదైనా జరిగి ఉంటే పోలీసులు భాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. తనకు సరైన సమయం కూడా ఇవ్వకుండా, పోలీసులు తన కారు ప్రమాదానికి కారకులయ్యారని ఆరోపించారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో కానీ, పోలీసుల ప్రకటనతో అసలు నిజం వెల్లడి కావాల్సి ఉంది.