Venkata Ramana on YCP: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి చేసే విమర్శల రూటే వేరు. నెల్లూరు యాసలో వైసీపీపై విమర్శలు గుప్పించడం లో ఆనం వెంకట రమణారెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన సెటైరికల్ కామెంట్స్ కి సోషల్ మీడియా ఫుల్ క్రేజ్ ఉంటుందనే చెప్పవచ్చు. తాజాగా ఏపీ ఆక్వా డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా నియమితులైన ఆనం, తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాలేమని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. తమకు మైక్ ఇచ్చే అవకాశం అసెంబ్లీలో లేనందున, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేమన్నారు. అలాగే ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ.. న్యాయస్థానాన్ని కూడా జగన్ ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఆనం వెంకటరమణా రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆనం మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. తమకు ఓటు వేసిన ప్రజల వాణి వినిపించే భాధ్యత జగన్, ఎమ్మెల్యేలపై లేదా అంటూ ప్రశ్నించారు. 2019 లో చంద్రబాబును ఉద్దేశించి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు, గన్ మెన్ సౌకర్యం, ఇతర సదుపాయాలు వద్దని స్పీకర్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు ఆనం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, సోషల్ మీడియా లో మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
సీఎం చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేస్తారని చాలా మంది కామెంట్స్ చేశారని, అటువంటి వారికి తన ఆక్వా డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి అంకితం చేస్తున్నట్లు ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు. ఆనం చేసిన కామెంట్స్ కి వైసీపీ ఎమ్మేల్యేల రివర్స్ ఎటాక్ ఎలా ఉంటుందో మరి వేచిచూడాలి.