AP DSC verification: ఏపీ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు చిన్నపాటి నిరాశ ఎదురైంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అనగా ఆగస్టు 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి వుండగా అనుహ్యంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. మరుసటి రోజు మంగళవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
ఉన్నట్లుండి ఈ నిర్ణయం వెనుక ఏం జరిగిందంటూ చర్చించుకోవడం అభ్యర్థుల వంతైంది. అయితే కాల్ లెటర్లు జారీ చేయడంలో ఆలస్యం దీనికి కారణమన్నది అధికారుల మాట. ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితా విడుదలైంది. అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు అధికారులు.
నార్మల్‌గా అయితే రిజర్వేషన్లు, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అర్హత సాధించినవారికి కాల్ లెటర్లు ఇస్తారు. పాత షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్‌కి కాల్‌లెటర్లు పంపేవారు. అయితే కాల్‌లెటర్ల అప్‌లోడ్ ఆలస్యం కారణంగా పరిశీలనను మరుసటి రోజు మంగళవారానికి వాయిదా వేశారు.
సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రక్రియ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. మంగళవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొదలుకానుంది.
ALSO READ: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, ఆనందంలో వారంతా
అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలు ఇప్పటికే పోర్టల్‌లో అప్డేట్ చేశారు. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే హెల్ప్‌డెస్క్ ద్వారా పరిష్కరించనున్నారు అధికారులు. అభ్యర్థులు సర్టిఫికెట్ల ఒరిజినల్స్ సిద్ధం చేసుకోవాలని సూచించారు కూడా. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది.
ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. సంబంధిత పాఠశాలల్లో నియామకాలను చేపట్టనున్నారు అధికారులు. ఎంపికైన వారిని తొలుత ఏజెన్సీ ప్రాంతాలకు వేస్తారని, అక్కడ కొన్నాళ్లు చేసిన తర్వాత అర్బన్‌కు పంపిస్తారంటూ ఇంకోవైపు ప్రచారం సాగుతోంది.
మెగా డీఎస్సీలో భాగంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఆయా పోస్టులకు దాదాపు 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. సమర్ధవంతంగా పరీక్షను నిర్వహించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది.