ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మార్చి 12, 13 తేదీల్లో (బుధవారం, గురువారం) రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం (మార్చి 12):
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు, శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం మండలాలు, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, వంగర మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (AP Disaster Management Authority) మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి వడగాల్పులు ప్రభావం చూపగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పరిస్థితి తీవ్రంగా మారింది. ఉదయం నుంచే ఎండలు మండుతున్నాయి, ప్రజలు ఎండల వేడికి బాధపడుతున్నారు. తీవ్రమైన ఎండ, వడగాల్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాల్పులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ మెసేజ్‌ల ద్వారా హెచ్చరికలు పంపించాలని నిర్ణయించారు.
Also Read: అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళికి బెయిల్.. విడుదలకు బ్రేక్..
బుధవారం రాష్ట్రంలో 180 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 21, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, అనకాపల్లి జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 18, కోనసీమ జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో 3, పల్నాడు జిల్లాలో 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
గురువారం (మార్చి 13):
గురువారం రాష్ట్రంలో 53 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు:
మంగళవారం (మార్చి 11) అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 39°C, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 39°C, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 38.7°C, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో 38.7°C, విజయనగరం జిల్లా నెలివాడలో 38.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
జాగ్రత్తలు:
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ధరించాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెవుల్లోకి వేడి గాలి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. గుండె సమస్యలు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమతో కూడిన పనులు ఎండలో చేయకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
వర్షాలు:
తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైతో పాటు 12 జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినందున, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వర్షాలు, ఎండలు..
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలో రానున్న మూడు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ నుంచి మొదలై బీహార్ వరకు వర్షాలు కురుస్తాయని.. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్యా రాష్ట్రాలకు, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మార్చి 15 వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ వర్షాలకు రెండు తుఫానులు కారణం. మొదటిది ఇరాక్ దేశంలో మొదలై.. కశ్మీర్ మీదుగా భారత్ లో ప్రవేశిస్తుంది. అలాగే మరొకటి బంగ్లాదేశ్ సమీపంలో మొదలై భారత్ లోని ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో మాత్రం ఎండలు భీకరంగా ఉంటాయని తెలిపింది. మార్చి 14వ తేదీ వరకు గుజరాత్ లో ఉష్ణోగ్రత 37 నుంచి 41 డిగ్రీలు ఉండే అవకాశమున్నట్లు తెలిపింది.