AP Liquor Case: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుల అరెస్టుల పర్వం మొదలైంది. తాజాగా ఈ కేసులో గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూర్ వెళ్లిన అధికారులు, అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.
లిక్కర్ కేసులో జోరుగా విచారణ
ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ జోరందుకుంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మూడు రోజుల కిందట ఏ-31, ఏ-32, ఏ-33 నిందితులుగా ఉన్న అప్పటి సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీకి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది సిట్.
ఆదివారం రోజు విచారణకు వారంతా డుమ్మూ కొట్టారు. అంతకుముందు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఈ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయల్ ఇవ్వడానికి నిరాకరించింది. కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతో సిట్ నోటీసులు జారీ చేసింది.
మైసూర్‌లో అదుపులోకి
భారతి సిమెంట్స్ కంపెనీలో డైరెక్టర్‌గా గోవిందప్ప కొనసాగుతున్నారు. అయితే నిందితుల ఆచూకీ కోసం సిట్ అధికారులు గాలింపు మొదలుపెట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నిఘా పెట్టారు. చివరకు మంగళవారం ఉదయం (మే 13న) మైసూర్‌లో గోవిందప్పను అరెస్టు చేశారు అధికారులు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌తో ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.
ALSO READ: ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంలో షాక్.. ఆ విషయంలో స్మాల్ రిలీఫ్
వైసీపీ హయాంలో జగన్‌కు అత్యంత సన్నిహతులు వ్యవహారించారు గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి. మద్యం సరఫరా కంపెనీలు మొదలు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ తర్వాత వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కీలకపాత్ర పోషించారనేది ప్రధాన అభియోగం.
ముడుపులు ఎంత చెల్లించాలనే దానిపై వీరంతా మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని ఇప్పటికే తేల్చింది సిట్. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి ఈ ముగ్గురుకి అందజేస్తే దాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు అందజేసినట్టు వార్తలు లేకపోలేదు. అరెస్టయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో ఇదే విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. తాజాగా గోవిందప్పు అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.