AP : తొలిసారి ఎమ్మెల్యే. ఆ వెంటనే మంత్రి పదవి. ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు ఇలాంటి అవకాశం. పెనుకొండ ఎమ్మెల్యే సవిత చాలా లక్కీ లీడర్. అనూహ్యంగా ఆమెను మంత్రి పదవి వరించింది. జిల్లాలో, రాష్ట్రంలో పరపతి పెరిగింది. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని అంటారు. కానీ, సవిత అసహనం ప్రదర్శించారు. గౌరవంతో ఇచ్చిన ఫ్లవర్ బొకేను విసిరేశారు. అది కెమెరాకు చిక్కడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి సవిత తీరుపై విమర్శలు వస్తున్నాయి.
బొకే విసిరేసిన మంత్రి
ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభమైన సందర్భంగా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురంలో రేషన్ షాపుల రీఓపెన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత ఇద్దరు అధికారులు ఇచ్చిన ఫ్లవర్ బొకేను విసిరేశారు. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. మంత్రి ఎందుకలా చేశారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎందుకు అలా..?
పెనుకొండ CSDT ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసుగ్గా తీసుకుని వెనక్కి విసిరేశారు. ఆమె వెనకాలే వస్తున్న గన్‌మెన్ సైతం ఆ బొకేను అందుకోలేక పోయాడు. ఎగిరి అతని తల మీదుగా అవతల పడింది. అంతేకాదు, పక్కనే ఉన్న మరో అధికారి సైతం మంత్రికి మరో బొకే ఇచ్చారు. అది పట్టుకున్నట్టు చేసి ఫోటో దిగి.. అతని చేతిలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బొకే విసిరేయలేదు కానీ.. అలాగని తీసుకోనూ లేదు. ఆ సందర్భంలో మంత్రి చాలా చిరాకుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ సైతం విసుగ్గా ఉన్నాయి.
వీడియో వైరల్..
మేడమ్ ఏదో ఫ్రస్టేషన్‌లో ఉన్నారు కావొచ్చని అధికారులు లైట్ తీసుకున్నారు. అంతకంటే ఏం చేస్తారు కనుక. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంత్రి సవిత తీరుపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మంత్రి అన్నాక కాస్త ఓపిక ఉండాలని సూచిస్తున్నారు. బొకేలకే చిరాకు పడి విసిరేస్తే ఎలా? ముందుముందు ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందోనని జోకులు కూడా వేస్తున్నారు. ప్రాబ్లమ్ బొకేలతోనా? అధికారులతోనా? మంత్రితోనా? అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.