Balineni Srinivasa Reddy: ఏపీలో పొలిటికల్ బాంబులు విసురుతున్నారు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని. అది కూడా నేను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు ఆయన. ఈ దెబ్బకు వైసీపీకి మైండ్ బ్లాక్ కావాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి వివాదం రేగుతుండగా, మాజీ సీఎం జగన్ అక్రమంగా సుమారు రూ. 1700 కోట్ల వరకు లాభం పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అప్పటి విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నుండి జనసేనలో చేరిన బాలినేని కుండబద్దలు కొట్టారనే చెప్పవచ్చు. అప్పటి సీఎం జగన్ నేరుగా అదానీ గ్రూప్ తో చర్చలు జరిపారని, తనను ఏ ఒక్కరూ కలవలేదని తెలిపారు. అంతేకాదు అర్థరాత్రి ఫోన్ చేసి సంతకం పెట్టమంటే, తాను ససేమిరా అన్నట్లు.. ఇప్పుడు అదే వివాదంగా మారిందన్నారు.
అలాగే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో బాలినేని మరో కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడం విశేషం. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ గా పదవిలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ఎంపీ పదవిలో ఉండగా, అక్కడ తన తోటి ఎంపీలతో పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంతో మెలిగే వారు సీఎం రేవంత్. తెలంగాణ ఎన్నికల అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. దీనితో ఢిల్లీ లో తన తోటి ఎంపీలకు, ఎమ్మేల్యేలకు రేవంత్ రెడ్డి పార్టీ ఇచ్చారు.
ఆ పార్టీపైనే బాలినేని కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లిన వైసీపీకి చెందిన 17 మంది ఎంపీలు, ఎమ్మేల్యేలకు జగన్ 2024 ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదని బాలినేని చెప్పారు. కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లినందుకే సీటు ఇచ్చేందుకు జగన్ సుముఖత చూపలేదని, ఇదొక్కటి చాలు జగన్ నైజం తెలుసుకొనేందుకు అంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు బాలినేని. ఈ సంచలన కామెంట్స్ బాలినేని ప్రత్యేకించి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పగా.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. బాలినేని చేసిన ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.