Lowest Temperature: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండురోజులుగా ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. రాబోయే కొద్దివారాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తాజా హెచ్చరిక.
డిసెంబర్-జనవరి నాటికి తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారుల మాట. ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికొస్తే.. మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ప్రస్తుతం 11 మండలాలను చలి వణికిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
పాడేరు, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. అరకులో 8. 9 డిగ్రీలు, డుంబ్రిగూడ లో 9.7, మాడుగులలో 10 డిగ్రీలు, ముంచంగిపుట్టు, హుకుంపేటలో 10.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించలేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలవుతోంది.
మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్యగా మారింది. సెల్ సిగ్నల్స్ రాక ఇబ్బందులు పడుతున్నారు పర్యాటకులు. రాత్రివేళ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలి మంటలు వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రోడ్లపై పొగమంచు కమ్మేస్తోంది. చాలా చోట్ల పగటి వేళ వాహనదారులు లైట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ విషయానికొస్తే.. రెండురోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. పటాన్‌చెరులో 12.4 డిగ్రీలకు పడిపోయింది.
తెలంగాణ అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజన్న సిరిసిల్లలోని వీర్నపల్లిలో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.9 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 12.0 డిగ్రీలుగా ఉంది. రాబోయే కొన్ని వారాల పాటు చలిగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
శీతాకాలం తీవ్రతరం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రతలో మరింత పడిపోవచ్చని చెబుతోంది. మున్ముందు విపరీతమైన చలిని ఎదుర్కొనేందుకు నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.