Thalliki Vandanam 2025: ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కుటుంబాల్లో ఈ మధ్య ఒక్కటే టాపిక్.. ఒక్క ఓటీపీతో డబ్బులు వచ్చినట్టు చెప్పారు, నిజమేనా? అని. ఇంట్లో విద్యార్థులు ఇద్దరిద్దరు ఉంటే, తల్లులు బ్యాంకు ఖాతాలు చెక్ చేయడం మొదలుపెట్టారు. ఏ పథకం? ఎక్కడ జమ అవుతుంది? ఏ ఖాతాలో వేసారు? అనే సందేహాలతో ప్రతి ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో, కాలేజీల్లో పిల్లలు అడిగిన ప్రశ్న నాకూ వస్తుందా అమ్మా? అనే అమాయక ప్రశ్నకు ఇప్పుడు స్పష్టమైన సమాధానం వచ్చింది.
2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో తల్లికి వందనం పథకాన్ని జూన్ 12, 2025న ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. అయితే జూన్ 12 ఒక్క రోజే కాదు, రోజూ అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతూ ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు, వారిలో ఎవరైతే అర్హులు కాగలరో, వారికి ఈ నగదు నేరుగా ఆధార్-లింక్ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ప్రస్తుతం ఎవరైతే అర్హులై ఉండి జాబితాలో ఉంటారో వారికి, మొదటి తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా జులై5న నగదు క్రెడిట్ కానున్నట్లు సమాచారం.
ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000 మంజూరు అవుతోంది. అందులో రూ.2,000 పాఠశాల నిర్వహణ నిమిత్తం ఆ స్కూల్ లేదా కాలేజీ ఖాతాకు వెళ్తుంది. మిగిలిన రూ.13,000 తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతోంది. ఈ నగదు పంపిణీ పూర్తిగా NPCI ఆధార్ బ్యాంక్ లింక్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అంటే, తల్లికి ఏ బ్యాంకు ఖాతా ఆధార్‌తో చివరిసారిగా లింక్ అయి ఉందో, ఆ ఖాతాలోనే డబ్బు జమ అవుతుంది. అందుకే చాలామందికి డబ్బు వచ్చినా, ఏ ఖాతాలో వచ్చిందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
Also Read: Hyderabad to Tirupati: హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నారా? ఈ రూట్ వెరీ షార్ట్ కట్ గురూ!
ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఇచ్చింది. ఒక్క ఓటీపీతో, మీరు నగదు జమ అయిందా లేదా, ఏ ఖాతాలో వచ్చిందో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసింది. మీ మొబైల్ నుంచే స్టేటస్ తెలుసుకోవచ్చు. దాని కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా స్టేటస్, SMS ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. అంతే కాదు, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుతో లింక్ అయి ఉందో కూడా ఒక క్లిక్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు డబ్బు ఏ ఖాతాలోకి వచ్చిందో ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు.
ఇంకొక ముఖ్య విషయం.. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే, అంతమంది పేర్లకు తల్లి పేరు ఆధారంగా ఉన్న ఖాతాలో డబ్బు వస్తుంది. ఒక విద్యార్థి ఉంటే రూ.13,000, ఇద్దరు ఉంటే రూ.26,000, ముగ్గురైతే రూ. 39,000 ఇలా పెరుగుతుంది. తల్లి లేకపోతే తండ్రి, అతనూ లేకుంటే సంరక్షకుడి ఖాతాలో జమ అవుతుంది. ఇంకా మీకు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లడం తప్పనిసరి కాదు. ఇప్పుడు ప్రభుత్వం రెండు మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ, వార్డు వెల్ఫేర్ ఉద్యోగి (WEA/WEDPS) ద్వారా వారి పోర్టల్లో చెక్ చేయించవచ్చు. అధికారికంగా వేసిన నోటీసు బోర్డుల్లో అర్హుల, అనర్హుల జాబితాను చెక్ చేయవచ్చు.