Minister Srinivas Varma : దేశ రాజధాని దిల్లీలో అనుకోకుండా చోటుచేసుకున్న ఓ పొరబాటులో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో.. కేంద్ర సహాయ మంత్రికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన తలకు, కాలికి గాయలయ్యాయి. దీంతో.. మంత్రితో పాటుగా ఆయన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాసేపటి తర్వాత కోలుకున్న శ్రీనివాస వర్మ.. తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు.
దిల్లీలోని తన కార్యాలయం నుంచి దిల్లీ విమానాశ్రయానికి వస్తున్న క్రమంలో.. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathi Raju Srinivasa Varma) ప్రయాణిస్తున్న కారు.. విజయ్ చౌక్ వైపు వస్తుండగా.. మార్గం మధ్యలో అడ్డు వచ్చిన ఓ వాహనాన్ని తప్పించబోయి.. సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో.. కారు పక్క లైన్ లోకి వెళ్లిపోగా.. ఎదురుగా వస్తున్న మరో కారు సహాయ మంత్రి కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కారు ముందు భాగం.. బాగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, ఇతర సిబ్బంది బాగానే ఉండగా.. శ్రీనివాస వర్మ కాలికి, తలకి గాయాలయ్యాయి. దాంతో.. వెంటనే ఆయనను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి గాయాలకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మందులు అందించారు. వర్మకు అధికారిక కార్యక్రమాలు, నియోజకవర్గం, రాష్ట్రంలో కొన్ని సమావేశాలు ఉన్నందున వెంటనే… అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు వచ్చేశారు.
రెండు కార్లు ఢీకున్న ప్రమాదంలో.. మంత్రికి తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత కాసేపు ఆందోళనకు గురైన కేంద్రమంత్రి.. తర్వాత తేరుకుని తన షెడ్యూల్ కొనసాగించారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు.. సాయంత్రం 05:30 గంటలకు ఎయిర్పోర్టు నుంచి విజయవాడ వచ్చేశారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రంలో పాల్గొన్నారు. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.