APSRTC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు 25 శాతం ప్రత్యేక రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికే ఇలాంటి రాయితీ కల్పించగా, ఇప్పుడు.. దేశంలోని ఎవరైనా ఏపీలో రాయితీ పొందవచ్చని ప్రకటించింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ – ఆర్టీసీ (APSRTC).. ఇకపై బస్సుల్లో ప్రయాణించే వాళ్లు వయస్సు నిర్ధరణ పత్రాల ఆధారంగా టికెట్లు జారీ చేయాలని సూచించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. సీనియర్ సిటిజన్లు 25 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. అయితే.. ఇందుకోసం ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసే ధృవపత్రాలను తీసుకువెళ్లాలని సూచించింది. పెద్దవాళ్లంతా.. టికెట్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్ పోర్టు లేదా రేషన్ కార్డుల్లో ఏదైనా ఒక దానిని కండక్టర్ కి చూపించాలని సూచించింది. లేదంటే.. రాయితీ పొందేందుకు వీలవదని తెలిపింది.
గతంలో కొన్నిచోట్ల ఇతర రాష్ట్రాలు జారీ చేసిన కార్డులను ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అంగీకరించడం లేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది. దాంతో.. వారికి రాయితీ అందలేదని, పూర్తి టికెట్లకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని సీనియర్ సిటిజన్లు బాధ పడ్డారని వెల్లడించింది. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందికి ప్రత్యేక నోటీస్ బోర్డులు, సమావేశాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల (జీవో) ప్రకారం.. ఇకపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులను పరిగణలోకి తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆర్టీసీ సిబ్బంది పాటించేలా.. ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వయసు నిర్థరణ పత్రాలు.. వర్జినల్ కార్డులు, డిజిటల్ కార్డులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
Also Read : వైజాగ్ లో ఇద్దరు మహిళల ఘర్షణ.. నీటి యుద్దం కాదు కానీ.. తెగ కొట్టుకున్నారు
గతంలో ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంది. కొవిడ్ కారణంగా.. వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజల ప్రయాణాల్ని తగ్గించే చర్యల్లో భాగంగా 2020 మే 21న రాయితీని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ.. కొత్త కూటమి ప్రభుత్వంలో రాయితీ సౌకర్యాన్ని తిరిగి ప్రవేశం పెట్టారు. అయితే.. అప్పుడు ఈ సౌకర్యం కేవలం ఆంధ్రప్రదేశ్ వాసులకు మాత్రమే ఉంటుండేది. కానీ.. ఇప్పుటి నుంచి దేశంలోని ఎవరైనా 60 దాటిన వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో 25 శాతం రాయితీ కల్పించనున్నారు.
కొవిడ్ కారణం చూపుతూ తీసేసిన రాయితీని తిరిగి పునరుద్ధరించాలని చాలాసార్లు ప్రభుత్వానికి సీనియర్ సిటిజన్ల సంఘలు విజ్ఞప్తి చేశాయి. కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు.. కొత్తగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వం.. ఈ ప్రతిపాదనను అంగీకరించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.