Assets Issues Between Bhuma Akhila Priya and AV Subbareddy: రాయలసీమ జిల్లాలలో ఒకటైన కర్నూలులో ఫ్యాక్షన్ ప్రతికారాలు నేటికీ అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న కుటుంబాలలో భూమా కుటుంబం ఏవి సుబ్బారెడ్డి మధ్య వైర్యం ముదురుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆళ్లగడ్డలో మరోసారి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు. దీంతో భూమా, ఏవీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. గతంలో భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి కి ఆ కుటుంబానికి మధ్య వైరం ఎక్కడ ఏర్పడింది..? అసలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయమేంటి..?
ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణలకు దిగి ఆస్తులు ధ్వంసం చేసుకోవడంతో పాటు, రక్తపుటేరులను పారిస్తున్నారు. అయితే ఏపీలోని ఆళ్లగడ్డలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు, నిప్పుగా మారారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, తెలుగుదేశం నేత ఏవి సుబ్బారెడ్డి. ఈ ఇద్దరి వర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి.
గతంలో భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి లు అత్యంత సన్నిహితులు. భూమా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఏవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి వెంట నడుస్తూ ఆయన రాజకీయ ఎదుగుదలకు కూడా ఏవి సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డికి ఆ కుటుంబంతో దూరం పెరిగింది. భూమా నాగిరెడ్డికి సంబంధించిన కీలక ఆస్తుల విషయంలో సమాచారాన్ని ఏవి సుబ్బారెడ్డి తమకు తెలపడం లేదంటూ భూమా వారసురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా విక్ఖ్యాత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలా చిన్నా చిన్నా విషయాలు చిలికి చిలికి గాలివానల మారడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
Also Read: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?
గత రెండేళ్ల క్రితం తనను హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో భూమా అఖిలప్రియ పై ఫిర్యాదు చేశారు ఏవీ. తదనంతరం ఎర్రగుంట్లలో సైకిల్ యాత్ర చేపడుతున్న ఏవి సుబ్బారెడ్డి పై కొందరు అగంతకులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఆ మధ్య నంద్యాలలో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి పై భూమా అఖిలప్రియ అనుచరులు దాడులు చేశారు. దీంతో నంద్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ సంఘటనలో అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులు కామ్ గా ఉన్నారు ఇరు వర్గీయులు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ పోలింగ్ ముగిసేంత వరకూ సంయమనం పాటించిన ఇరువర్గాలు.. ఓటింగ్ ముగిసీ ముగియగానే కయ్యానికి కాలు దువ్వారు. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. కారుతో దుండగులు ఆయన్ను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read: SIT Team report ready: సిట్ నివేదికలో కీలకాంశాలు, సాయంత్రం..
గతంలో నంద్యాలలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగా ప్రస్తుతం ఏవీ వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు అఖిలప్రియ ఆరోపిస్తోంది.
అయితే దీనిపై ఏవీ సుబ్బారెడ్డి ఇంకా స్పందించలేదు. దాడిలో గాయపడిన బాడీగార్డును నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు అటు అఖిల ప్రియ, ఇటు ఏవీ సుబ్బారెడ్డి ఇళ్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలో 144 సెక్షన్ విధించి.. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేశారు.
మొత్తంగా తాజా ఘటనతో నంద్యాల తో పాటు ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. ఈ సంఘటనలో పాల్గొన్నవారు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘటనలు జిల్లాలో పాత ఫ్యాక్షన్ చరిత్రను పున ప్రారంభిస్తాయన్న సందేహాలు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Prashant kishor says ysrcp will loss: ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌కిషోర్, జగన్ ఓడిపోవడం ఖాయం, కారణాలు..