AP DGP :
⦿ పలువురి నుంచి రూ.కోట్లలో వసూలు
⦿ ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
⦿ 34 శాతం పెరిగిన సైబర్ క్రైమ్
⦿ రూ.1,229 కోట్లు దోచుకున్న మోసగాళ్లు
అమరావతి, స్వేచ్ఛ: ఇటీవల డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీని పేరుతో సైబర్ నేరగాళ్లు పలువురిని బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, కావాలని ఆ పేరుతో చేస్తున్న బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. కొంతకాలంగా రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఈ ఏడాది సైబర్ క్రైమ్ 34 శాతం పెరగగా, 916 కేసులు నమోదు చేశామని, మోసగాళ్లు రూ.1,229 కోట్లు దోచుకున్నారని డీజీపీ వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
ఇదిలాఉండగా గత సంవత్సరం (97,760)తో పోలిస్తే ఈ ఏడాది (92,094) క్రైమ్స్ రిపోర్ట్ అవగా ఓవరాల్‌గా క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇక, దొంగతనం, దోపిడీ కేసులు 0.2 శాతం పెరగగా, మహిళల విషయంలో నేరాలు 10 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 4.9 శాతం తగ్గగా, మహిళల హత్యలు మాత్రం 20 శాతం పెరిగాయన్నారు. ఇక సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల అంశంలో ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని అన్నారు.
ఆయా కేసుల్లో రౌడీ షీట్ తరహాలో నిందితులపై సైబర్ షీట్ తెరుస్తామని పేర్కొన్నారు. వచ్చే మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో లక్ష సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తామని, ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 73 డ్రోన్లను వినియోగిస్తున్నామని, మనిషి వెళ్లలేని చోట వాటి అవసరం పడుతోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
రాష్ట్రంలో గంజా కేసులు కూడా 3 శాతం పెరిగాయని అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈగల్’ వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని చెప్పారు. గంజాయి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని గిరిజనులకు చెబుతున్నామని, ఇప్పటికే 10,837 ఎకరాల్లో ఇతర పంటలు వేయించామని డీజీపీ స్పష్టం చేశారు. దేశంలో తొలిసారిగా ఏపీలోనే ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ ని ఉపయోగిస్తున్నామని, ఏలూరు జిల్లా పోలీసులు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ప్రారంభించారని తెలిపారు.
నేరాల నమోదు నుంచి కేసు విచారణ వరకు దాని సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా విజయవాడలో ట్రాఫిక్, ప్రజా రద్దీ నియంత్రణకు ఏఐ ఓ అస్త్రంలా ఉపయోగపడుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈమధ్య హాట్‌టాపిక్‌గా మారిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెక్యురిటీలోకి నకిలీ ఐపీఎస్‌ను అరెస్ట్ చేశామని, అతనిపై విచారణ జరుపుతున్నామన్నారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని పేర్కొన్నారు.