Balineni Srinivasa reddy: ఎవరైనా అదానీ వ్యవహారంలో నా పాత్ర ఉందని నిరూపిస్తే, తన కుటుంబంతో సహా ఉరేసుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో బిగ్ టీవీ ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వివాదం సాగుతున్న వేళ ఇటీవల బాలినేని చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా అసలు విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఓ వైపు బాలినేని కామెంట్స్ పై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించిన నేపథ్యంలో బాలినేని మరోమారు సవాల్ విసిరారు. అసలు బాలినేని ఏమి చెప్పారంటే..
ఇటీవల అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గౌతం అదానీ నుండి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగారు.
అందుకే తనకు అదానీ పాపంలో భాగం లేదని బాలినేని స్పందించారు. అది కూడా తనను అర్ధరాత్రి నిద్రలేపి ఒప్పందంపై సంతకం పెట్టమని ఫోన్లు వచ్చాయని, తాను సంతకం చేయక పోవడంతో కేబినెట్ భేటీలో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇటీవల వైసీపీతో కటీఫ్ చెప్పి జనసేనలో చేరిన బాలినేని ఈ కామెంట్స్ చేయడంపై రాజకీయ దుమారం రేగింది.
ఇదే విషయంపై బిగ్ టీవీతో బాలినేని మాట్లాడుతూ.. అదానీ విద్యుత్ ఒప్పంద వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనతో అదానీ ఎప్పుడూ భేటీ కాలేదని, కనీసం సెకీ అధికారులు కూడా విద్యుత్ ఒప్పందంపై మాట్లాడలేదన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఎన్నడూ చర్చించలేదని, అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని కేబినెట్‌లోనే ఖరారు చేశారని మరోమారు పురుద్ఘాటించారు. అర్ధరాత్రి ఫోన్ల మీద ఫోన్లు చేసి మరీ సంతకం పెట్టమన్నారని, లంచాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఎఫ్‌బీఐ అమెరికా కోర్టులో రిపోర్టు ఇచ్చిందని తెలిపారు.
అదానీ వ్యవహారంలో తన పాత్ర ఒక్క శాతం ఉందని తేలినా తన కుటుంబమంతా ఉరేసుకుంటామని బాలినేని సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలను మోసం చేసి సంపాదించుకునే వ్యక్తిత్వం తనది కాదని, అదానీ ఇష్యూ కి తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే వైసీపీ నేత చెవిరెడ్డిని టార్గెట్ చేస్తూ బాలినేని చేసిన కామెంట్స్ పై చెవిరెడ్డి కూడా స్పందించారు. బాలినేని అబద్ధాలు మాట్లాడుతున్నారని, జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం బాలినేనికి సరికాదన్నారు.
బ్లాక్‌మెయిల్‌తో జగన్‌ను బాలినేని ఇబ్బందిపెట్టారని, బ్లాక్‌మెయిల్ చేసినా జగన్ భరించారని తెలిపారు చెవిరెడ్డి. కూటమితో బాలినేని జత కలిసి జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారన్నది తన భావనగా చెవిరెడ్డి తెలిపారు. మొత్తం మీద బిగ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలినేని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.