Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రంలో పెరిగిన ధరలు, పాలనా వైఫల్యాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మోసం
గతంలో బీసీలకు వైసీపీ ఎన్ని స్థానాలు ఇచ్చింది.. టీడీపీ ఎన్ని ఇచ్చిందో లెక్కలు తీయాలని బొత్స సవాల్ చేశారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసినా, చంద్రబాబు కేవలం జీవోలతో బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. జీవో ద్వారా రిజర్వేషన్లు నిలవవని తెలిసినా కోర్టుల పేరుతో ప్రజలను మాయ చేశారని ఆరోపించారు. న్యాయపరంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టలేదని, కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు సరైన రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కూడా రాజ్యాంగ సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేకుండా దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు మేం సిద్ధం
గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ పిరికిపందలా పారిపోయిందని, కానీ తాము ఇప్పుడు ఎన్నికల నుంచి పారిపోవడం లేదని, పోటీకి సిద్ధంగా ఉన్నామని బొత్స చెప్పారు. తాము ఎన్నికలను అడ్డుకోవడం లేదని, జరపాలనే కోరుతున్నామని వివరించారు.
ధరల భారం.. పడిపోయిన పాలన
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.82కు చేరిందని, కూరగాయల ధరలు 62 శాతం పెరిగాయని పత్రికలే చెప్తున్నాయని గుర్తుచేశారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని పరిశ్రమలు వచ్చాయి..? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు..?’ చెప్పాలని బొత్స ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. ఇకనైనా అబద్ధాలు, వెన్నుపోటు రాజకీయాలు విడిచిపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
Also Read: హరీశ్ రావు పరువు నష్టం దావా కేసు.. కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు సమన్లు!