Schezwan Chicken Noodles: చైనీస్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకాల్లో చికెన్ నూడుల్స్ ఒకటి. అందులోనూ కారం, వెల్లుల్లి రుచి, చికెన్ ముక్కలతో చేసే ‘షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్’ ప్రత్యేకమే. వేడివేడిగా ఉన్న నూడుల్స్‌లో కరకరలాడే కూరగాయలు, మెత్తని చికెన్ ముక్కలు, ఘాటైన షెజ్‌వాన్ సాస్ కలిస్తే ఆ రుచే వేరు. బయట రెస్టారెంట్‌లో దొరికే ఈ నూడుల్స్‌ను ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు.
పిల్లలకు, పెద్దలకు నచ్చేలా మీ అభిరుచికి తగినట్లుగా కారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సాయంత్రం స్నాక్‌గా, వీకెండ్ స్పెషల్‌గా లేదా రాత్రి భోజనంగా చేసుకోవడానికి ఈ రెసిపీ బాగా సెట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రుచికరమైన షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి..
నూడుల్స్ – 200 గ్రాములు
బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు
ఉల్లిపాయ – ఒకటి
క్యారెట్ – ఒకటి
క్యాబేజీ – ఒక కప్పు
క్యాప్సికమ్ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్
అల్లం తరుగు – ఒక టీ స్పూన్
షెజ్‌వాన్ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు
సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్
టమాటో సాస్ – ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి – అర టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
స్ప్రింగ్ ఆనియన్స్ – రెండు టేబుల్ స్పూన్లు
Also Read: 10 నిమిషాల్లో పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్ షెజ్‌వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్!
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకుని కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు మరిగించి కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి నూడుల్స్ ఉడికించాలి. అవి మరీ మెత్తగా కాకుండా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి చల్లటి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మీడియం మంటపై పూర్తిగా ఉడికే వరకు వేయించాలి. చికెన్ ఉడికిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి రెండు మూడు నిమిషాలు ఎక్కువ మంటపై వేయించాలి. కూరగాయలు కొద్దిగా క్రంచీగా ఉంటేనే నూడుల్స్‌కు మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు షెజ్‌వాన్ సాస్, సోయా సాస్, టమాటో సాస్ వేసి బాగా కలపాలి. ముందుగా వేయించిన చికెన్ ముక్కలను వేసి కలిపిన తర్వాత ఉడికించిన నూడుల్స్ జోడించాలి. నూడుల్స్ విరిగిపోకుండా మెల్లగా కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు సరిచూసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ చల్లాలి. అంతే.. ఘాటైన రుచితో నోరూరించే షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ సిద్ధం. వీటిని వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి మరింత బాగుంటుంది.
Also Read: ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!