Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లకు సమన్లు జారీ చేసింది. ఈనెల 29న వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కొన్నిరోజుల క్రితం హరీశ్ రావు కర్ణాటక రాష్ట్రంలోని మూకాంబిక దేవాలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో వర్షాలు కురవొద్దని క్షుద్రపూజలు చేయటానికే హరీశ్ రావు అక్కడికి వెళ్లారని మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ లు ఆరోపణలు చేశారు.
బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
వీటిపై స్పందించిన హరీశ్ రావు తనపై నిరాధార ఆరోపణలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు క్షమాపణలు చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, గడువులోపు మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. దాంతో మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లపై ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. కేసును విచారిస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ లను ఈనెల 29న కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.
Also Read: కాంగ్రెస్ మూడేళ్ల పాలన ఫెయిల్.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం: కవిత