Tirumala Accident : తిరుమల తిరుపతిలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తొక్కిసలాట ఘటన జరగగా.. ఇప్పుడు ఘాట్ రోడ్డులో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు సమాచారం. కాగా.. తిరుమల ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి వెళుతున్న బస్సు.. సోమవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం.
పైకి వెళ్లేటప్పుడు సహజంగానే వాహనాలు వేగంగా వెళుతుంటాయి. అలా రెండో ఘాటు రోడ్డు ద్వారా పైకెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మలుపు చివరన ఉండే పిట్టగోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇందులో.. 10 మందికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది.
ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని రక్షించి, దగ్గర్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ వారికి ప్రథమ చికిత్స అందించి, స్విమ్స్ కు తరలించారు. పైకి వెళ్లే మార్గంలోని మలుపులో ప్రమాదం జరగడంతో.. వెనుక వస్తున్న వాహనాలతో దాదాపు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో.. కొండ పైకి వెళ్లే మార్గంలో తీవ్ర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ తొలగించే పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ప్రమాదానికి కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.