Game Changer Movie Leak : ఒక సినిమా తెరకెక్కించాలంటే చిత్ర బృందం పడే కష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ కలిసి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా వెనుక ఉండే కష్టం ఎలాంటిదో ప్రతీ ఒక్కరికి తెలిసిందే. మరి దాదాపు 3 ఏళ్లకు పైగా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కష్టపడి తీసిన ఒక సినిమా విడుదలకు ముందే నెట్టింట లీక్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సమస్యనే ఎదుర్కుంది తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీ.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని అనౌన్స్ చేసినప్పటినుంచి.. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి సినిమా విడుదలకు ముందే ఆన్లైన్ లో పైరసీకి గురి అయ్యింది. జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా పైరసీ ప్రింట్ నెట్టింట హల్చల్ చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.
గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందే నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని ప్రముఖ వ్యక్తులకు సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. తాము డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరించారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక సీన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో సైతం షేర్ చేశారు. విడుదలయ్యాక HD ప్రింట్ లీక్ చేయడమే కాకుండా.. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లో ఈ సినిమాను షేర్ చేశారు.
ఈ విషయంపై గేమ్ ఛేంజర్ చిత్ర బృందం సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేసింది. తమకు వచ్చిన బెదిరింపు మెసేజెస్ తో పాటు పైరసీ ప్రింట్ లీక్ చేసిన వారందరిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఇక ఈ లీక్ వెనుక దాదాపు 45 మంది ముఠా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 45 మంది ఓ ముఠాగా ఏర్పడి ‘గేమ్ చేంజర్’ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? వారే పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై మరిన్ని విషయాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన అప్పటినుంచి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లో విపరీతంగా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు ముఖ్యమైన సన్నివేశాలు సైతం లీక్ చేసి ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పేజీలపై ఇప్పటికే సినీ బృందం కంప్లైంట్ చేసింది. త్వరలో ఆ సోషల్ మీడియా పేజెస్ పై సైతం చర్యలు తీసుకోనున్నట్టు సైబర్ క్రైమ్ బృందం తెలిపింది.
ALSO READ : గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో.. 120 మంది పిల్లలు దత్తత..!