CM Chandrababu: కూటమి సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందా? సంక్రాంతి సందర్భంగా జగన్ వేసిన ఎత్తుకు.. చంద్రబాబు ప్రభుత్వం పైఎత్తులు వేసిందా? ఇకపై జగన్‌ను ప్రజలు మరిచిపోవడం ఖాయమా? కూటమి సర్కార్ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా, వైసీపీని తలదన్నేలా ఉన్నాయా? అవుననే అంటున్నారు ఏపీ వాసులు.
పేద ప్రజలకు సెంటు లేదా సెంటున్నర భూమి ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వం. ఊరికి చివరలో వారికి భూములు కేటాయించింది. జగనన్న పేరిట కాలనీలు వెలిశాయి. తమ ప్రభుత్వంలో ఊళ్లకు ఊళ్లను నిర్మించామంటూ గొప్పలు చెప్పుకునేవారు ఆ పార్టీ నేతలు. వాటికి సదుపాయాలు మాట కాసేపు పక్కనబెడదాం.
పేదలకు కేవలం సెంటు స్థలం ఇవ్వడాన్ని అప్పటి ప్రతిపక్షం టీడీపీ సైతం తప్పుపట్టింది. రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరునెలల వ్యవధిలో పేద ప్రజల ఇళ్లపై దృష్టి సారించింది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైంది పేద ప్రజలకు ఇళ్లు.
పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు నిబంధనలు సైతం తీసుకొచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో హౌసింగ్ స్కీమ్ కింద లోన్ తీసుకోకూడదన్నది తొలి నిబంధన. దరఖాస్తు దారులు బీపీఎల్ కింద ఉన్నవారికే. కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలన్నది మరో నిబంధన.
ALSO READ: ఏపీలో అమిత్ షా.. టూర్ అందుకేనా?
మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలు, మాగాణి రెండున్న ఎకరాల లోపు ఉండాలన్నది మరో పాయింట్. గతంలో వైసీపీ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్లు స్థలాలు ఇచ్చింది. చాలామంది ప్రజలు వైసీపీ ఇచ్చిన లేఅవుట్లు నివాసానికి అనుగుణంగా లేవని వెళ్లలేదు. చెరువుల్లో కొందరు, శ్మశానంలో మరికొందరికి భూములను ఇచ్చారు. వాటిని చాలామంది వదిలేశారు.
అలాంటివారికి గతంలో కేటాయింపులు రద్దు చేసి.. మళ్లీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది కూటమి సర్కార్. గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాలు చాలా మంది నిర్మాణాలు చేపట్టలేదు. కొందరు మాత్రమే కట్టుకున్నారు. కట్టలేని వారికి ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేసి కొత్తగా పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వనుంది.
సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుంచి పల్లెలకు చాలామంది వెళ్లారు. ఆ సమయంలో జగనన్న కాలనీల వద్ద చాలామంది వైసీపీ మద్దతుదారులు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దానికి మాంచి స్పందన వచ్చిందన్నది వైసీపీ నేతల మాట. దాని ధీటుగా శుక్రవారం చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు.
కూటమి సర్కార్ నిర్ణయం ఒక విధంగా జగన్‌కు ఊహించని షాక్‌గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కూటమి సర్కార్‌కు కేంద్రం నుంచి పుష్కలంగా అండదండలు ఉన్నాయని, నిధులు అలాగే వస్తున్నాయని చెబుతున్నారు. తమకు అలా లేదని వాపోతున్నారట. కూటమి సర్కార్ పథకాలు చూస్తుంటే.. వైసీపీని మించే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కన జగన్‌బాబుకు ఫ్యూచర్‌లో కష్టాలు తప్పవదన్నది కొందరి నేతల మాట.
పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/KJo2ayIRk2
— Telugu Desam Party (@JaiTDP) January 17, 2025