CM Chandrababu: ఆడ బిడ్డల జోలికి వస్తే చూస్తూ ఊరుకొనే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వేస్ట్ టు వెల్త్ సహా వివిధ మోడల్స్ ని చంద్రబాబు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని నిర్ణయించామన్నారు. ఈ రోజు కందుకూరుకు అందుకే వచ్చానన్న సీఎం, ఒక్క రోజు మన ఊరు శుభ్రంగా ఉంచటానికి అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే, మంచి ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీతో సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందన్నారు.
8 నెలల్లోనే అభివృద్ది వైపు పయనం..
ప్రతినెల పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పెన్షన్లు ఒకటవ తేదీనే ఇంటివద్దకు తీసుకెళ్లి ఇస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ప్రజల్లో ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడా లేని ధైర్యం వస్తుందని, ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు.
వైసీపీపై చంద్రబాబు కామెంట్స్
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పులకు అసలు, వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. మరో పక్క ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించినట్లు తెలిపారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామని, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Singer Mangli: పార్టీలను కాదు.. పాటను నమ్ముకున్నా.. మంగ్లీ సీరియస్ కామెంట్స్
ఆ ఘటనను గుర్తు చేసుకున్న టీడీపీ క్యాడర్
కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన సంధర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పర్యటన సంధర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు రెండు రోజుల పాటు కందుకూరులో ఉండి మరీ మృతుల కుటుంబాలను పరామర్శించడమే కాక, ఆర్థికంగా సాయం అందించారు. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు కూడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలను బాబు ఆప్యాయంగా పలకరించారు.